
మృతదేహాన్ని పరిశీలిస్తున్న మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి
సాక్షి, మెదక్: పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన మహిళ హత్యకు గురైన సంఘటన మెదక్ మండలం అవుసుపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హవేలిఘనాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన విజయ (విజ్జి) (26) శనివారం కూలిపని కోసం మెదక్‌కు వెళ్లింది. శనివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు తెలిసిన వారిని విచారించగా ఆచూకి లభించలేదు. ఆదివారం ఉదయం అవుసులపల్లి శివారులోని ఓ మర్రిచెట్టు కింద మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూడగా శవం విజయగా గుర్తించారు. సంఘటన స్థలంలో బిర్యాని, మద్యం బాటిళ్లు పడి ఉన్నాయి. పనికోసం వెళ్లిన విజయను గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి అత్యాచారం చేసి, చీరతో మెడకు బిగించి హత్యచేసినట్లు గుర్తించారు. సంఘటన స్థలాన్ని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్‌రూరల్ సీఐ రాజశేఖర్, రూరల్ ఎస్‌ఐ లింబాద్రిలు, పరిశీలించి డాగ్‌స్క్వాడ్‌ను తీసుకొచ్చారు. డాగ్‌స్క్వాడ్ మెదక్ మండలం అవుసులపల్లి గేటు వరకు వెళ్లి అక్కడే ఆగిపోయింది. మృతురాలి సోదరుడు బద్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment