టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గుబులు.. | TRS Activists Fear From Naxals In Warangal | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గుబులు..

Published Mon, Jul 29 2019 9:21 AM | Last Updated on Mon, Jul 29 2019 9:23 AM

TRS Activists Fear From Naxals In Warangal - Sakshi

ఏజెన్సీలో కూబింగ్‌ చేస్తున్న పోలీసు బలగాలు

సాక్షి, ఏటూరునాగారం: మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలోని టీఆర్‌ఎస్‌ నాయకుల్లో గుబులు పుట్టింది. మావోయిస్టు నక్సల్స్‌ టీఆర్‌ఎస్‌ నాయకులను టార్గెట్‌ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కే) మండలాలకు చెందిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను సురిక్షత ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో సేఫ్‌ జోన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

చిట్యాల, రేగొండ, టేకుమట్ల, పలిమల వంటి ప్రాంతాల్లోని టీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు టార్గెట్‌లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా గ్రామాల్లో ఉండొద్దని రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో పోలీసులు వారికి సెల్‌ఫోన్, మేసేజ్‌తోపాటు, లిఖిత పూర్వకంగా కూడా ముందస్తు హెచ్చరికలను అందజేశారు. పూర్వపు ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు నాయకులను, టార్గెట్లను అప్రమత్తం చేస్తూ వారికి రక్షణ కల్పిస్తున్నారు. జూలై 12న కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని బేస్తకొత్తూరుకు చెందిన పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును ఈనెల 8న మావోయిస్టులు అపహరించుకు తీసుకెళ్లారన్నారు.

ఈనెల 12న ఛత్తీస్‌గఢ్‌లోని పుట్టపాడుకు వెళ్లే మార్గంలో శ్రీనివాసరావు మృతదేహాన్ని ఆయన బైక్‌ను వదిలిపెట్టి వెళ్లారు. అక్కడే అతడిని హతమార్చారు. అయన టీఆర్‌ఎస్‌ పార్టీ కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వాటిని ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సవాల్‌గా తీసుకొని ప్రత్యేక చర్యలను ముమ్మరం చేశారు. అడవుల్లో కూంబింగ్‌తోపాటు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, గొత్తికోయగూడెంల్లో ఆకస్మిక తనికీలు, కార్డెన్‌ సెర్చ్‌ కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర ప్రధాన రోడ్డు అయిన ఛత్తీస్‌గఢ్‌– హైదరాబాద్‌ ప్రాంతాల మధ్యలోని ఏటూరునాగారం వై జంక్షన్, ముల్లకట్ట బ్రిడ్జి వద్ద పోలీసులు గట్టి నిఘా వేసి తనిఖీలను తీవ్ర స్థాయిలో చేపడుతున్నారు. ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు, మావోయిస్టుల కదలికలతో ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement