సాక్షిప్రతినిధి, వరంగల్: గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ స్థానాలను కైవసం చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు గెలుపు బాధ్యతలను అప్పగించగా, వరంగల్‌లో గ్యాదరి బాలమల్లు, మహబూబాబాద్‌లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఇన్‌చార్జిలుగా ఉన్నారు.
రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జిగా దయాకర్‌రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెనయిర్ల జాబితాలో కూడా ఉన్న దయాకర్‌రావు హెలిక్యాప్టర్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
‘ఓరుగల్లు’పై గులాబీ జెండా
ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్, మహబూబాబాద్‌లపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ గులాబీ జెండా ఎగురేసింది. హన్మకొండ తర్వాత 2009 పునర్విభజనలో వరంగల్‌గా ఏర్పడిన ఈ స్థానానికి 1952 నుంచి 2015 వరకు మూడు ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 19 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ ఐదు, టీఆర్‌ఎస్ మూడు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి.
టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో ధరావత్ రవీంద్రనాయక్ గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలో టీడీపీ, 2009లో కాంగ్రెస్‌లు గెలుపొందాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడంతో 2015 వచ్చిన ఉప ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ విజయం సాధించారు.
మానుకోటలో టీఆర్‌ఎస్ పాగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మహబూబాబాద్ లోక్‌సభ స్థానం ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ఈ సమయంలో 1957, 1962లలో సార్వత్రిక ఎన్నికలు, 1965లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సమయాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే విజయం వరించింది. ఆ తర్వాత ఈ స్థానం రద్దయి 2009లో మళ్లీ ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
మొత్తం నాలుగుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. 2014లో మహబూబాబాద్(ఎస్టీ)లో టీఆర్‌ఎస్ పక్షాన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలుపొందారు. మహబూబాబాద్‌లో ఇద్దరు గిరిజనులు ఒక్కోసారి గెలువగా, ఒక రెడ్డి నేత ఒకసారి, ఇతర సామాజిక వర్గానికి చెందిన మరొకరు రెండుసార్లు ఎన్నికయ్యారు. బలరాం నాయక్ 2009లో లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి పొందారు.
ఇదిలా వుండగా ఖమ్మం జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో కలిపి తెలంగాణ, ఆంధ్ర పాంతాలకు వారధిగా ఉండే భద్రాచలం నియోజకవర్గం 2009లో రద్దు అయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు గెలుపొందగా, సీపీఐ మూడుసార్లు, సీపీఎం ఒకసారి గెలుపొందాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఎన్నికలో గులాబీ జెండా ఎగురేసిన టీఆర్‌ఎస్ మళ్లీ గెలిచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
నేటి నుంచి ప్రచారం ఉధృతం... కేటీఆర్, కేసీఆర్ సభలకు ఏర్పాట్లు
నామినేషన్ల ఉప సంహరణకు గురువారంతో గడువు ముగియడంతో ప్రధాన పార్టీల్లో ప్రచార వేడి మొదలయింది. ప్రధానంగా టీఆర్‌ఎస్ మరింత దూకుడు పెంచింది. తెలంగాణలో 16 స్థానాలే లక్ష్యంగా గులాబీ దళనేత కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా.. వరంగల్, మహబూబాబాద్ స్థానాలపై ఉమ్మడి జిల్లా నేతలు గురి పెట్టారు. ఈ లక్ష్యంలో కేసీఆర్, కేటీఆర్‌ల ఆదేశాలు, సూచనల మేరకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్యానాయక్, అరూరి రమేష్ తదితరులతో పాటు ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమన్వయం చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఆయన ఇంట్లో ఈ ముఖ్యనేతలతో ఐదారుసార్లు భేటీలు కూడా నిర్వహించారు. రెండు స్థానాల్లో పరిధిలోని 14 సెగ్మెంట్లకు ఇన్‌చార్జిలను నియమించడంతో పాటు మండల, డివిజన్, నియోజకవర్గం స్థాయి సమావేశాలు కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. శనివారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సంపేట, ములుగులలో సభలు నిర్వహించనుండగా, 2న వరంగల్, 4న మహబూబాబాద్‌లలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారసభలలో పాల్గొని ప్రసంగించనున్నారు. వరంగల్, మహబూబాబాద్ స్థానాలు లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment