
‘హోరు’గల్లు...
నేడు ఓరుగల్లులో టీఆర్‌ఎస్ 16వ ఆవిర్భావ బహిరంగ సభ
► మూడేళ్ల పాలన తర్వాత అధికార పార్టీ బలప్రదర్శన
► ‘రైతు’ అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్న సభ
► ప్రభుత్వ ప్రగతిపై విస్తృత ప్రచారానికి వ్యూహం
► రైతులు, కార్యకర్తలు సహా లక్షలాది మంది సమీకరణ
► మంత్రుల నేతృత్వంలో ముందే తరలిన రైతులు
ఓరుగల్లు.. జన హోరుగల్లులా మారింది. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి స్వాగతం పలుకుతూ గులాబీ వర్ణమయమైంది. అధికారం చేపట్టి మూడేళ్లు కావడంతో నేతలు బలప్రదర్శనకు అన్నీ సిద్ధం చేశారు. ‘ప్రగతి నివేదన’గా సభకు నామకరణం చేశారు.
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ, ఉచిత విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులు.. మొదలుకుని తాజాగా ప్రకటించిన ఎకరానికి రూ.8 వేల ఆర్థిక సాయం వరకూ.. మూడేళ్ల పాలనలో ప్రగతిని ప్రజలకు వివరించేందుకు తెలం గాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) సిద్ధమైంది. టీఆర్‌ఎస్ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు ‘ప్రగతి నివేదన’గా పేరు పెట్టింది.
ప్రభుత్వం రైతాంగం సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించే ఉద్దేశంతో రైతు సంబంధ అంశాలకే సభలో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణ బకాయిలు రూ.17 వేల కోట్లను మాఫీ చేసింది. నాలుగో విడత బకాయిలను బ్యాంకులకు చెల్లించాక రైతాంగానికి ఊరట కలిగించే మరో ప్రకటనను సీఎం కేసీఆర్ చేశారు. వచ్చే సంవత్సరం నుంచి ఖరీఫ్, రబీ సీజన్లలో ఒక్కో ఎకరానికి రూ.4 వేల చొప్పు న మొత్తంగా ఎకరానికి రూ.8 వేల చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఇదే అంశానికి విస్తృత ప్రచారం కల్పించాలని టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం భావిస్తోంది.
టీఆర్‌ఎస్ బలప్రదర్శన..
మూడేళ్ల పాలన పూర్తి కావడం, మరో రెండేళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ సభను రాజకీయంగా అత్యంత కీలకంగా టీఆర్‌ఎస్ భావిస్తోంది. 75 లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసి దేశంలో అత్యంత పెద్ద పార్టీల్లో ఒకటిగా అవతరించామని భావిస్తున్న టీఆర్‌ఎస్.. ఈ సభకు అదేస్థాయి గుర్తింపు తెచ్చే ప్రయత్నాల్లో పడిం ది.
రైతులు, పార్టీ కార్యకర్తలు సహా మొత్తంగా 15 లక్షల మందిని సభకు సమీకరించాలని భావిస్తోంది. దీంతో చాలా ముందుగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు జన సమీకరణ బాధ్యత అప్పజెప్పింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఇటీవల ప్రభుత్వంపై ముప్పేట దాడిని ప్రారంభించాయి. దీంతో మరోసారి తమ బలమేంటో చూపించాలని టీఆర్‌ఎస్ భావి స్తోంది. రాష్ట్ర ప్రజానీకానికి తమ పాలన గురించి పూర్తి స్థాయి నివేదిక అందేలా సభ జరపాలనుకుంటోంది.
మంత్రుల నేతృత్వంలో రైతులు
రైతుల సమీకరణను భుజాన వేసుకున్న ఆయా జిల్లాల మంత్రులు ట్రాక్టర్లలో రైతులతో పాటు ప్రయాణిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మంత్రి జూపల్లి, మంత్రి లక్ష్మారెడ్డి వెంట జడ్చర్ల నియోజకవర్గ కార్యకర్తలు, రైతులు, మంత్రి పోచారం నాయకత్వంలో ట్రాక్టర్లలో రైతులు ర్యాలీగా సభకు బయలు దేరారు.
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 18 బోగీలతో ప్రత్యేక రైలును సభ కోసం ఏర్పాటు చేశారు. మధిర నియోజకవర్గం నుంచి మరో ప్రత్యేక రైలును వేశారు. జన సమీకరణపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ట్రాక్టర్ల ర్యాలీ వ్యూహం వల్ల సభకు ఒక రోజు ముందు, సభ తర్వాత మరోరోజు టీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతుల ప్రయాణాలు సాగేలా ప్లాన్ చేసింది.