సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల : తెలంగాణ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాటలు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నాలుగు విప్లవాలతో ఆర్థికాభివృద్ధి సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించి హరిత విప్లవం సాధిస్తామని, చేపల పెంపకంతో నీటి విప్లవం, పాడిపరిశ్రమ అభివృద్ధితో శ్వేత విప్లవం, మాంసం ఉత్పత్తులను ఎగుమతి చేసి గులాబీ విప్లవాన్ని సాధిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఖలేజా ఉన్న నాయకుడని ఆయన ఏం చేసినా.. మొదట ఇది అయితదా..? అనే అనుమానం వస్తుందన్నారు. పట్టుదల చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా అవుతుందనే నమ్మే వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ సాధన నుంచి రైతుల బీమా.. గొర్రెల పంపిణీ వరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు కేసీఆర్ అన్నారు. కులవృత్తులకు చేయూతనిచ్చి ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కట్టని సాగునీటి ప్రాజెక్టును నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. గొర్రెల పంపిణీ గొప్ప పథకమని, దుర్వినియోగం చేయొద్దని కేటీఆర్ కోరారు.
త్వరలో గేదెల పంపిణీ: తలసాని
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. త్వరలో రూ.900 కోట్లతో గేదెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. రాష్ట్రంలో గతేడాది 60 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని, మరో 25 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయని వివరించారు. రూ.వెయ్యి కోట్ల సంపద గొల్లకుర్మల దరి చేరిందని తెలిపారు. 65 వేల గొర్రెలు చనిపోయాయని, వాటికి బీమా వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 50 శాతం సబ్సిడీతో పాడిపరిశ్రమలను అభివృద్ధి చేస్తామన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న 24 గంటలు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతులకు బీమా వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదన్నారు. సిరిసిల్ల ప్రజలు రాష్ట్రానికి ఆణిముత్యం లాంటి మంత్రి కేటీఆర్‌ను అందించారన్నారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పశుసంవర్ధకశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్‌తో కలసి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment