నిరుపేదలకు అండగా ఉంటాం
మంత్రి మహేందర్‌రెడ్డి హామీ
దుండిగల్: నిరుపేద ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట గ్రామంలో రూ.8 కోట్లతో బీటీ రోడ్డు, రూ.13.5 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయల నిధులతో ఆర్‌అండ్ బి రోడ్లు వేస్తున్నామన్నారు. చెరువుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు.
కుత్బుల్లాపూర్ మండలంలో త్వరలోనే బస్‌డిపో ఏర్పాటు చేస్తామన్నారు. సూరారం కాలనీ 107 సర్వే నెంబరులోని 60 గజాల స్థలాల సమస్యలపై కలెక్టర్‌తో చర్చిస్తామని, కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మల్లంపేట సర్పంచ్ అర్కల అనంత స్వామి ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, బి.ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, ఎమ్మార్వో కృష్ణ, ఎండీఓ కె.అరుణ, టీఆర్‌ఎస్ నేతలు శంభీపూర్‌రాజు, కొలన్ హన్మంత్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కావలి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ ప్రసంగాన్ని అడ్డంకులు
మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రసంగిస్తూ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ లోనూ అభివృద్ధి జరగాలని అనడంతో టీఆర్‌ఎస్ నాయకులు ఒక్కసారిగా ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్..అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బంగారు తెలంగాణ ను నిర్మిస్తారంటూ పేర్కొన్నారు. కాగా ఎంపీ ప్రసంగించే ముందు జై తెలంగాణ నినాదం చేసి ప్రసంగించాలని దుండిగల్ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. ఇక కుత్బుల్లాపూర్ మండలంలోని పలు సమస్యలపై మంత్రి మహేందర్‌రెడ్డికి ఎంపీపీ, సర్పంచ్‌లు విన్నవించారు.