
ఫీజులు, రుణాలు చెల్లించొద్దు
* ప్రజలకు కాంగ్రెస్ శాసనసభాపక్షం పిలుపు
* టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలి
* పోలవరం ఆర్డినెన్సు రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే
* లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులెవరూ ఈ విద్యా సంవత్సరానికి ఫీజులు కట్టొద్దని కాంగ్రెస్ శాసనసభాపక్షం పిలుపునిచ్చింది. అలాగే రైతులెవరూ బ్యాంకు రుణాలు చెల్లించొద్దని కోరింది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పోలవరం ఆర్డినెన్సును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని పేర్కొంది. బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీ సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం ఐదు తీర్మానాలు చేసింది. మల్లు భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురికాని గ్రామాలను కూడా ఆంధ్రలో కలపడం వెనుక పెద్ద కుట్ర కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయంవల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరందించే రుద్రమకోట ప్రాజెక్టును తెలంగాణ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తక్షణమే పోలవరం ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం.
-తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకూ కేజీ నుంచి పీజీ దాకా సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆంగ్ల మాద్యమంలో ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అలాగే * లక్షలోపు రైతు రుణాలను రద్దు చేస్తామని పేర్కొంది. పాఠశాల, కళాశాలల అడ్మిషన్లు మొదలయ్యాయి. విద్యార్థులెవరూ ఫీజులు కట్టొద్దు. యాజమాన్యాలేవీ ఫీజులు తీసుకోవద్దు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. ఎంసెట్ కౌన్సెలింగ్ సమయంలోనూ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.
- రైతులు కూడా రుణాలు చెల్లించొద్దు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున తక్షణమే రుణ వసూళ్లను నిలిపివేయాలి. కొత్త రుణాలిప్పించాలి. ఐకేపీ ధాన్య సేకరణ సందర్భంగా రైతులకిస్తున్న చెక్కులు బ్యాంకుకు వెళితే నగదు విడుదల చేయకుండా రుణాలు చెల్లించాలంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అందోళనలో రైతులున్నందున వెంటనే రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలి.
-ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రకటించి పెన్షన్ లేదా ఉద్యోగం, ఇళ్లు, భూమి ఇవ్వాలి.