వేదికపై నృత్యం చేస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
చెన్నూర్‌రూరల్/చెన్నూర్ : కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ అన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో అన్నారం బ్యారేజీ వద్ద మంగళవారం జల జాతర, సామూహిక వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరంలాంటిదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర, మధ్య తెలంగాణకు 45 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని, హైదరాబాద్‌కు 40 టీఎంసీల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 30 శాతం, మిషన్ భగీరథకు 60 శాతం నీరు అందుతుందని చెప్పారు. అయితే.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తోందని విమర్శించారు.
సామూహిక వనభోజనాలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణ ప్రాజెక్టుల గురించి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తుంటే.. ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు మాత్రం రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో గోదావరి జలాల మీద ఏనాడూ ఒప్పందం కుదుర్చుకోలేదని విమర్శించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞుడిలా వ్యవహరించి ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి నీరు అందిస్తున్నారని తెలిపారు. కాళేళ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎగువ, దిగువ ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో నదీ జలాలపై గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిందన్నారు. పక్క రాష్ట్రాలతో ఎలాంటి పంచాయితీ లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూర్ నియోజకవర్గంతోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్‌రావు, కోరుకంటి చందర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, నారదాసు లక్ష్మణ్‌రావు, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంథని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, జక్కు శ్రీవర్షిణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment