మంచిరెడ్డికి ఓటేయకూడదని బొట్టుపెట్టి ప్రచారం చేస్తున్న అసమ్మతి నేతలు (ఫైల్)
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతుష్టులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా ఇన్నాళ్లు నిరసనగళం వినిపించినా ఫలితం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ముందుచూపుతో ఇప్పటికే కొందరు ఇతర పార్టీలోకి జంప్ చేయగా మరికొందరు వేరు కుంపటి పెట్టేశారు. టీఆర్‌ఎస్ అధిష్టానం సెప్టెంబర్ 6న టికెట్లను ప్రకటించడమే తరువాయి.. టికెట్లను ఆశించిన ఔత్సాహికుల ఆశలు అవిరయ్యాయి. టికెట్లు తమకేనని ధీమా ప్రదర్శించిన వారంతా ఢీలా పడ్డారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచినవారిని కాదని కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తమ అనుచరులతో సుదీర్ఘ మంతనాలు సాగించిన అసమ్మతివాదులు పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. అభ్యర్థిని మార్చాలని అన్ని రకాల ప్రయత్నాలను సాగించారు. అయినప్పటికీ, అధిష్టానం దిగిరాకపోవడంతో రూటు మార్చాలని తాజాగా నిర్ణయించారు.
జంపింగ్ జపాంగ్!
చేవెళ్ల సెగ్మెంట్ నుంచి 2014లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన కేఎస్ రత్నంకు ఈసారి చుక్కెదురైంది. గత ఎన్నికల్లో ఆయనపై గెలిచి.. ఆ తర్వాత పార్టీ మారిన కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్యకే టీఆర్‌ఎస్ టికెట్టు దక్కింది. ఈ పరిణామంతో కంగుతిన్న రత్నం.. ‘కారు’ దిగి ‘చేయి’ పట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.
‘కొత్త’ దారిలో..
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో మహేశ్వరం స్థానం నుంచి పోటీచేసి పరాజయం పాలైన కొత్త మనోహర్‌రెడ్డిది ఇదే పరిస్థితి. తనపై నెగ్గిన తీగల కృష్ణారెడ్డి(టీడీపీ)ని అక్కున చేర్చుకోవడమేగాకుండా టికెట్ కూడా కేటాయించడంతో మనోహర్‌రెడ్డి నిరాశకు గురయ్యారు. కొన్నాళ్లు అధిష్టానానికి సానుకూలంగా.. అభ్యర్థికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించిన ఆయన ఇక లాభం లేదనుకొని కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపిన ఆయనకు టికెట్‌పై స్పష్టమైన హామీ లభించిందో లేదో తెలియదు కానీ ప్రచారరథాలను కూడా రెడీ చేసుకుంటున్నారు.
వీర్లపల్లి దారెటు?
షాద్‌నగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే మండలాల వారీగా పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్న ఆయనకు ఇటీవల సీనియర్ నేత అందె బాబయ్య ఎమ్మెల్యే శిబిరంలోకి చేరి గట్టి షాక్ ఇచ్చారు. అంజయ్యను ఓడించడమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని శంకర్ తేల్చిచెబుతున్నారు. శంకర్‌ను బుజ్జగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించనట్టు కనిపిస్తోంది.
కల్వకుర్తిలోనూ లొల్లే..
కల్వకుర్తి టికెట్టును జైపాల్‌యాదవ్‌కు ఖరారు చేయడంతో టీఆర్‌ఎస్‌లో అసమ్మతి భగ్గుమంది. వైరివర్గమంతా నిరసన గళం వినిపించినా చివరకు మెత్తబడింది. అయితే, స్థానిక ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం మాత్రం ఇంకా గుర్రుగానే ఉంది. జైపాల్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా పోటీ చేయాలని కసిరెడ్డిపై ఒత్తిడి చేస్తోంది. అనుచరుల ఒత్తిడికి తలొగ్గి రంగంలోకి దిగడానికి సమాలోచనలు జరిపిన నారాయణరెడ్డి ప్రస్తుతం ఒకింత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఆయన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశముంది. అసమ్మతివాదులు పోటీకి దూరంగా ఉన్నా.. జైపాల్‌కు వ్యతిరేకంగా చాపకింద నీరులా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
పిలుపు కోసం..
రాజేంద్రనగర్ టికెట్ రాకపోవడంతో నిరాశకు గురైన సీనియర్ నేత తోకల శ్రీశైలంరెడ్డి కూడా అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను ఓడించడానికి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా బీజేపీ నుంచి బరిలో దిగడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment