
సాక్షి, హైదరాబాద్: తన అధీనంలో ఉన్న భూమిని కొంతమంది టీఆర్‌ఎస్ నేతలు కబ్జా చేశారంటూ వరంగల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు రెండు రోజులుగా అసెంబ్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కలవాలని పోలీసులను అభ్యర్థిస్తూ ఉస్మానియా గేటు బస్టాండులో నిరీక్షిస్తోంది. వరంగల్ జిల్లా కేంద్రం శివారులోని జక్కులొద్ది గ్రామానికి చెందిన వెంకటమ్మ, తన తాతముత్తాతల నుంచి అధీనంలో ఉన్న టెనెన్సీ భూములను టీఆర్‌ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని నాలుగేళ్లుగా పోరాటం చేస్తోంది. దీనిపై ఎంఆర్‌వో నుంచి ఉపముఖ్యమంత్రి వరకు అందరికీ ఫిర్యాదు చేసింది. హైకోర్టులో కేసు కూడా తనకే మద్దతుగా వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది.
ఈ విషయంపై సీఎం కేసీఆర్‌కే విన్నవించుకునేందుకు వచ్చానని మంగళవారం అసెంబ్లీ గేటువద్ద పోలీసులతో మొరపెట్టుకుంటూ ‘సాక్షి’కి కనిపించింది. పాస్‌లేకుండా తాము పంపించలేమని పోలీసులు చెప్పడంతో కన్నీరుమున్నీరైంది. వెంకటమ్మతో సాక్షి మాట్లాడగా, సీఎం ఇంటి వద్దకు వెళ్లి కలిసేందుకు ప్రయత్నించానని, అయితే బలవంతంగా పోలీసులు రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి దింపారని తెలిపింది. రెండు రోజుల నుంచి అసెంబ్లీ దగ్గరే ఉంటున్నానని చెప్పింది. తనకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే కొండా సురేఖకు విన్నవించుకుందామని వెళితే పట్టించుకోలేదని వెంకటమ్మ ఆరోపించింది. సీఎం మాత్రమే తనకు న్యాయం చేస్తారని, ఆయనను కలిసిన తర్వాతే ఇంటికి వెళ్తానని వెంకటమ్మ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment