మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందని వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. హ్యాట్రిక్ వీరులు.. సీనియర్ ఎమ్మెల్యేలు తమకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని విశ్వసిస్తున్నారు. కేబినెట్ పరిమిత మోతాదులో ఉంటుందని సంకేతాలు వెలువడడంతో తమకు అవకాశాలు ఏ మేర కలిసివస్తాయని బేరీజు వేసుకుంటున్నారు. సుదీర్ఘ అనుభవం, సామాజిక సమీకరణలపై లెక్కలు వేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ కూర్పులో జిల్లా నుంచి ఎవరికి చాన్స్ దక్కుతుందనే అంశం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కేపీ వివేకానంద, చామకూర మల్లారెడ్డిలు మంత్రిపదవి రేసులో ఉన్నారు.
ఎవరి లెక్కలు వారివే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ముహూర్తం ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డిని ఓడించిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మంత్రి పదవిపై గంపెడాశ పెట్టుకున్నారు. మంత్రిగా వ్యవహరించిన సోదరుడు మహేందర్‌రెడ్డి పరాజయం పాలుకావడంతో ఆయన కోటాలో తనకు బెర్త్ ఖాయమనే భరోసాలో నరేందర్‌రెడ్డి ఉన్నారు. అయితే, కొడంగల్ సెగ్మెంట్‌ను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో తీసుకుంటారా? లేక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా పరిగణిస్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. మూడుసార్లు వరుసగా విజయం సాధించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా మంత్రి పదవిపై గట్టినమ్మకం పెట్టుకున్నారు.
మృదుస్వభావిగా పేరున్న ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నికల ముందు జరిగిన ప్రగతి నివేదన సభతో ఇది మరింత బలపడింది. ఈ నేపథ్యంలో తన పనితీరును ఏంటో సీఎంకు తెలుసని భావిస్తున్న కిషన్‌రెడ్డి.. మంత్రి పదవి వ్యవహారం కూడా ముఖ్యమంత్రే చూసుకుంటారనే ధీమాలో ఉన్నారు. మరో హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన సామాజికవర్గానికే చెందిన వివేకానంద, శ్రీనివాస్‌గౌడ్, పద్మారావులు మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తుండడం ప్రకాశ్‌కు ప్రతిబంధకంగా మారింది. ఇక, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కూడా అమాత్య యోగంపై ఆశలు పెట్టుకున్నారు.
మల్కాజిగిరి ఎంపీ పదవిని వదులుకొని ఎమ్మెల్యేగా పోటీచేసిన చామకూర.. తనకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమని భావిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే శాసనసభ్యుడిగా రంగంలోకి దిగానని సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా మంత్రివర్గ విస్తరణలో లక్కీచాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగియుండడ తనకు ప్లస్‌పాయింట్ కాగలదని అంచనా వేస్తున్నారు. పద్మారావుకు గనుక బెర్త్ దక్కకపోతే.. ఆయన స్థానే తనకు పదవి ఖాయమనే లెక్కల్లో వివేకానంద ఉన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా మినిస్టర్ గిరిపై ఆశలు పెట్టుకున్నా.. ఆయన సామాజికవర్గానికి సరిపడా పదవులు ఉన్నందున ఆయన పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. ఏదీఏమైనా మంత్రివర్గ విస్తరణ ప్రచారంపై అధికార పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment