'రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకెళ్లడం ఖాయం'
టీడీపీ నేతలు ఏపీలో ఒకమాట ఇక్కడొక మాట మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: టీడీపీ నేతలు ఏపీలో ఒకమాట ఇక్కడొక మాట మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ అదే మాట్లాడుతున్నారని తెలిపారు. అమరావతిలో బాబు టీటీడీపీ నేతలతో సీట్ల పెంపుపై చర్చించలేదా ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను సీబీఐ విచారించిందంటున్న రేవంత్ రెడ్డి దానికి ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీద ఎవడో ఏదో మాట్లాడాడని ఆ వ్యాఖ్యల మీద మేము స్పందించాలా ? అని అడిగారు.
రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. విపక్షాలు టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రం తీసుకున్న మూడు ప్రధాన నిర్ణయాలపై టీఆర్‌ఎస్ తీసుకున్న వైఖరిని కొందరు ప్రశ్నిస్తున్నారని, తెలంగాణ ప్రయోజనాల కోణంలోనే టీఆర్‌ఎస్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఓకే దేశం ఒకే పన్ను విధానం లక్ష్యంతో జీఎస్టీ అమల్లోకి వస్తోందని.. టీఆర్‌ఎస్ అవునన్నా.. కాదన్నా కేంద్రం జీఎస్టీ తీసుకురావాలన్న పట్టుదలతో ఉంది కాబట్టే మేం మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు.
టీడీపీ నేతలు అర్ధం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని.. జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీకి రాష్ట్రాల వారీగా విధానాలుంటాయా ? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు పిచ్చి కూతలు మానుకోవాలని సూచించారు. మా నేత కేసీఆర్ సూచన మేరకే మోదీ రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్‌ను ఎంపిక చేశారని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికపై కాంగ్రెస్ మమ్మల్ని ఏనాడైనా సంప్రదించిందా ? అని ప్రశ్నించారు.