మెదక్ లోక్‌సభ స్థానంలో తమ గెలుపు ఎప్పుడో ఖాయమైందంని.. అత్యధిక మెజార్టీయే లక్ష్యం అంటూ.. ‘గులాబీ’ దళం ప్రచారంలో దూసుకెళ్తోంది. ఎంపీ అభ్యర్థి గెలుపు, మెజార్టీ బాధ్యతలను టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకే అప్పగించిన నేపథ్యంలో వారు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఎక్కడా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు బాధ్యతను ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు భుజానికెత్తుకున్నారు. విస్తృత పర్యటనలు చేస్తూ టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఆయనతో పాటు లోక్‌సభ పరిధిలోని టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం విశేష కృషి చేస్తున్నారు.
సాక్షి, మెదక్: మెదక్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు (మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్‌చెరు) ఉన్నాయి. మెదక్ జిల్లా పరిధిలోకి మెదక్, నర్సాపూర్.. సిద్దిపేట జిల్లా పరిధిలోకి సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక.. సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ స్థానాలు వస్తాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ పరిధిలోని ఏడింటిలో సంగారెడ్డి మినహా ఆరింటిలో టీఆర్‌ఎస్ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ ఆధిక్యతతో మెదక్ ఎంపీ అభ్యర్థిని గెలిపించే బా«ధ్యతను కేసీఆర్ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఈ మేరకు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించాలనే లక్ష్యంతో జిల్లా పరిధిలోని మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు, గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతాల వారీగా పోలైన ఓట్లు.. ఎదురైన సంఘటనలను బేరీజు వేసుకుంటూ రూపొందించిన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నారు.
నర్సాపూర్ శ్రేణుల్లో ఉత్సాహం..
ప్రస్తుత పరిస్థితుల్లో నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయం కాగా.. ‘గులాబీ’ బలం రెట్టింపైనట్లు భావిస్తున్నారు. వచ్చే నెల 3న నర్సాపూర్‌లో జరిగే మెదక్ లోక్‌సభ నియోజకవర్గ భారీ బహింగసభకు సీఎం కేసీఆర్ హాజరుకానుండడం కలిసివస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో ‘కొత్త’ జోష్ కనిపిస్తోంది. నర్సాపూర్‌లో ఏడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ స్థాయిలో నర్సాపూర్‌లో ముఖ్య నాయకుల సమావేశాన్ని ఇదివరకే నిర్వహించారు. కొల్చారం, వెల్దుర్తి, అసునూరలో మండల స్థాయి సమావేశాలు జరిగాయి. హరీశ్‌రావుతోపాటు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొంటూనే ప్రచారం, రోడ్‌షోలతో హోరెత్తించారు. ఆదివారం శివ్వంపేట మండల సమావేశం నిర్వహించనున్నారు. మిగిలింది కౌడిపల్లి, చిలిపిచెడ్ మండలాలు మాత్రమే. ఆయా ప్రాంతాల్లో సీఎం సభ అనంతరం సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నియోజకవర్గంలో ‘కొత్త’ మెజార్టీ ఖాయమనే ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
మెదక్‌లో మెజార్టీయే లక్ష్యంగా..
ఇటీవల మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ డిప్యూటీ స్పీకర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న జరిగిన సన్నాహక సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య సహృద్భావ వాతావరణంలో సవాల్ నడిచింది. ‘మనకు కాంగ్రెస్, బీజేపీ పోటీ కాదు.. మనకు మన మధ్యే పోటీ.. మనకు వరంగల్, కరీంనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థుల మెజార్టీతోనే పోటీ’ అని హరీశ్‌రావు అన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ‘నేను కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. మీ కంటే ఒకటి, రెండు ఓట్‌లైనా ఎక్కువ సాధిస్తా’.. అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెదక్ అసెంబ్లీ నుంచి లక్ష మెజార్టీ ఖాయమని పద్మాదేవేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి నాయకులు, శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పట్టణంతోపాటు మెదక్ అసెంబ్లీ పరిధిలోని వివిధ మండలాల్లో ప్రచారంతోపాటు రోడ్డు షోలు నిర్వహించారు. మెజార్టీయే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళిక మేరకు ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment