'గులాబీ'ల పండుగ నేడే
► మరోమారు అధ్యక్షుడిగా కేసీఆర్.. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన లేనట్టే?
► నేడు టీఆర్‌ఎస్ 16వ వ్యవస్థాపక దినోత్సవం.. కొంపల్లిలో ప్లీనరీ
► అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఏడు తీర్మానాలు
► ప్రభుత్వ పనితీరుపై సవివరమైన చర్చ
► 15 వేల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు
► 2 వేల మంది పోలీసులతో బందోబస్తు
సాక్షి, హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వ్యవస్థాపక దినోత్సవానికి ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. శుక్రవారం కొంపల్లిలో జరగనున్న ఈ ప్లీనరీలో సీఎం, పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒకే నామినేషన్ మిగిలిన నేపథ్యంలో కేసీఆర్ ఎన్నిక ఏకగ్రీవమవుతోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిలో సంక్షేమ రంగ తీర్మానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్లీనరీకి పార్టీ నాయకత్వం ఎంపిక చేసిన 8 వేల మంది ఇవ్వనున్నారు. ప్లీనరీకి పార్టీ నాయకత్వం ఎంపిక చేసిన ఎనిమిది వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. భోజనాలు తదితర ఏర్పాట్లు మాత్రం పదిహేను వేల మందికి సరిపోయేట్లు చేస్తున్నారు. సుమారు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ మూడేళ్లు.. వచ్చే రెండేళ్లు..
పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, అనంతరం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ కావడం, వచ్చే రెండేళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో.. ఈ మూడేళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధిని, వచ్చే రెండేళ్లలో చేపట్టనున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఈ వేదికను ఉపయోగించుకోనున్నారు. ఈ ఆలోచనతోనే ప్లీనరీ జరుగుతున్న ప్రాంతానికి ‘తెలంగాణ ప్రగతి ప్రాంగణం’అని పేరు పెట్టారని చెబుతున్నారు.
వచ్చే ఏడాది నాటికి ఎన్నికల ముంగిట్లో ఉన్నట్టే కాబట్టి.. అప్పటి హామీలను ఎన్నికల ముందు ఇచ్చేవిగా భావించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనే దానిపై తమకు రెండేళ్ల ముందు నుంచే ఉన్న స్పష్టతను తెలియజెప్పేందుకు ప్లీనరీని ఉపయోగించుకుంటామని వ్యాఖ్యానిస్తున్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలనే కాకుండా, సంక్షేమ రంగంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాల గురించి ప్రచారం చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన లేనట్టే!
కొద్ది నెలలుగా టీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు సాగుతోందన్న ప్రచారం బలంగా ఉంది. కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు (కేటీఆర్), మంత్రి హరీశ్‌రావులు రెండు వర్గాలుగా విడిపోయారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ జిల్లాల్లో పార్టీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పజెబుతారని, ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని, దానిని ఈ ప్లీనరీలోనే ప్రకటించవచ్చని ప్రచారం జరిగింది. కానీ అలాంటి ఉద్దేశమేదీ కేసీఆర్‌కు లేదని, ఇప్పట్లో ఎలాంటి ప్రకటనా ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆరే ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతారని, రెండేళ్ల వరకు ఆయన ఆ పదవిలో ఉంటారు కాబట్టి, ఆయన సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళతారని పేర్కొంటున్నాయి. పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, అంతా కలసికట్టుగా ఉన్నామన్న సందేశాన్ని ఇవ్వడం, పార్టీ శ్రేణుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూడడం ప్లీనరీ ముఖ్య ఉద్దేశమని చెబుతున్నాయి.
ఇవీ తీర్మానాలు
ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. వాటిలో అంతర్భాగంగా మరికొన్ని అంశాలు ఉంటాయి. వాటిని ప్రవేశపెట్టి, చర్చించడానికి ఏడుగురు నేతలను ఎంపిక చేశారు. తీర్మానాలపై చర్చలో ఈసారి మంత్రులకు అవకాశం ఇవ్వడం లేదని పార్టీ వర్గాల సమాచారం. సాగునీటి పారుదల వ్యవస్థ, వ్యవసాయం – నిరంజన్‌రెడ్డి, వృత్తులు (గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం)– కొండా సురేఖ, మిషన్ భగీరథ– వేముల ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్ రంగంలో విజయాలు (ఐటీ, పరిశ్రమలు కూడా )– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రగతికాముక పథకాలు– ఎంపీ వినోద్ కుమార్, సంక్షేమం– పాయం వెంకటేశ్వర్లు, సామాజిక రుగ్మతల నియంత్రణ (పేకాట, గుడుంబా, అనవసర ఆపరేషన్ల కంట్రోల్)– నారదాసు లక్ష్మణ్‌రావు.
ఇదీ ఎజెండా..
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభిస్తారు. అనంతరం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగత ఉపన్యాసం ఉంటుంది. కె.కేశవరావు తొలి పలుకులు, తీర్మానాలపై చర్చ, మధ్యాహ్నం 1.30 గం. నుంచి 2.30 గంటల వరకు భోజన విరామం, తీర్మానాలపై చర్చ కొనసాగింపు, కేసీఆర్ ముగింపు ఉపన్యాసం ఉంటాయి. అయితే మంచి ముహూర్తం ఉండటంతో ప్లీనరీ ప్రారంభానికి ముందే శుక్రవారం ఉదయం 9.55 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికను ప్రకటించనున్నారు.