జిల్లాలో నకిరేకల్ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అనేక మంది పెద్దపెద్ద పదవుల్లో ఉన్నారు. అంతా తలపండిన నేతలు.. వీరిలో ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు.. ఇతర నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన వారూ ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యాడు. ఇక్కడ కారును పోలిన ట్రక్కు గుర్తు ఓటమికి ఓ కారణంగా నేతలు విశ్లేషిస్తున్నా.. ఇంతమంది పెద్ద నేతలు కూడా ప్రభావం చూపలేకపోయారనే చర్చ సాగుతోంది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నంత మంది వీఐపీలు ఏ నియోజకవర్గంలో లేరు. చూస్తే.. అంతా అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. ఈ సారి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన మరో ఇద్దరు నేతలు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారు. ఇంకా చెప్పాలంటే అంతా సీనియర్ నాయకులే. ఇంత మంది ఉన్నా.. చివరకు నకిరేకల్‌లో టీఆర్‌ఎస్‌కు విజయం దక్కలేదు. ఈ అంశమే ఇపుడు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఎన్నికల్లో కొందరు నేతలు ఆయా నియోజకవర్గాలకే పరిమితం అయినా, తమ సొంత నియోజకవర్గంలో మాత్రం ప్రభావం చూపలేక పోయారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం కోసం బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం.. కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. వీరి నడుమ ఉన్న ఓట్ల మెజారిటీ 8,259. అయితే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు, ఆ మరుసటి రోజు కూడా కారు గుర్తును పోలి ఉన్న సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు ట్రక్ వల్ల నష్టం జరిగిందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ట్రక్ గుర్తుకు ఏకంగా 10,383 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ నుంచి ట్రక్‌కు వచ్చిన ఓట్లను తీసేస్తే ఆ వ్యత్యాసం 2,124 ఓట్లుగా ఉంది. దీంతో కారుకు పడాల్సిన ఓట్లలో అత్యధికంగా కారును పోలిన ట్రక్‌కు పడ్డాయన్న ఓ అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు తమ అభ్యర్థి ఓటమిలో ట్రక్ గుర్తు చేసిన చేటు స్పష్టంగా కనిపిస్తున్నా, ముఖ్య నేతల మాట ఈ నియోజకవర్గంలో కానీ, వారి సొంత మండలాల్లో కానీ పెద్దగా ప్రభావం చూపలేదన్న చర్చ ఇపుడు నడుస్తోంది.
వీఐపీల నియోజకవర్గం..
నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు వివిధ ముఖ్య పదవుల్లో ఉన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా, రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఈ ఎన్నికల్లో దేవరకొండ, మిర్యాలగూడెం నియోజకవర్గాల బాధ్యతలు చూశారు. నకిరేకల్ నియోజకవర్గం పరిధి లోని చిట్యాలలో కూడా ప్రచారం చేశారు. ఇదే గ్రామానికి చెం దిన ఆయన సోదరుడు జితేందర్‌రెడ్డి మదర్ డెయిరీ చైర్మన్‌గా ఉన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కంచర్ల భూపాల్‌రెడ్డి సొంత గ్రామం కూడా ఉరుమడ్లనే. ఈ గ్రామంలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కన్నా టీఆర్‌ఎస్‌కు 346 ఓట్ల మెజారిటీ వచ్చింది. నార్కట్‌పల్లి మండలం నక్కలపెల్లి గ్రామానికి చెందిన బండా నరేందర్‌రెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.
నక్కలపెల్లిలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కన్నా కేవలం ఒక్క ఓటే అదనంగా పోలైంది. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఈ సారి నాగార్జునసాగర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన సొంత గ్రామం పాలెంలో వేముల వీరేశానికి కేవలం 19 ఓట్ల అధి క్యం మాత్రమే వచ్చింది. ఇక శాసన మండలి డిప్యూటీ చైర్మన్, టీచర్స్ ఎమ్మెల్సీ పూల రవీందర్ సొంత గ్రామం కేతేపల్లి మం డలం చెరుకుపల్లిలో టీఆర్‌ఎస్‌కు అదనంగా పడిన ఓట్లు కేవలం 251. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సొంత గ్రామం భీమారం కూడా కేతేపల్లి మండల పరిధిలోనిదే. ఈ ఎన్నికల్లో లింగయ్య యాదవ్ గ్రామంలో టీఆర్‌ఎస్‌కు 299 ఓట్ల లీడ్ వచ్చింది. ముఖ్య నాయకులు సొంత గ్రామాల్లో ఒకటీ రెండు చోట్ల మినహా కారుకు చెప్పుకోదగిన స్థాయిలో లీడ్ రాకపోవడం కూడా అభ్యర్థి ఓటమిలో ప్రభావం చూపిం దన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కచ్చితంగా గెలుస్తామని టీఆర్‌ఎస్ ధీమాగా ఉన్న నకిరేకల్ నియోకకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ కారణంగానే, వివిధ సమీకరణలతో ఓటమికి గల అన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు. నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ ఓటమిలో ప్రధానంగా నకిరేకల్, కట్టంగూరు, కేతేపల్లి మండలాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన లీడే కనిపిస్తోంది. రామన్నపేట, నార్కట్‌పల్లి మండలాల్లో కాంగ్రెస్‌కు స్వల్ప మెజారిటీ రాగా, చిట్యాల మండలంలో టీఆర్‌ఎస్‌కు లీడ్ దక్కింది. మొత్తంగా ఎనిమిది మంది పార్టీ ముఖ్యులు, వీఐపీలు ఉన్న ఈ నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment