గులాబీ ఖరారు..! | TRS Selects Banda Narender Reddy As ZP Chairman | Sakshi
Sakshi News home page

గులాబీ ఖరారు..!

Published Sat, Apr 20 2019 10:54 AM | Last Updated on Sat, Apr 20 2019 10:54 AM

TRS Selects Banda Narender Reddy As ZP Chairman - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : స్థానిక  సంస్థల ఎన్నికలకు రేపో.. మాపో నగరా మోగనుంది. ఈలోగానే అధికార టీఆర్‌ఎస్‌ విపక్షాలకు సవాలు విసిరింది. నల్ల గొండ జెడ్పీ చైర్మన్‌ పోస్టుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డిని ఎంపిక చేసింది. ఆయన తన సొంత మండలం నార్కట్‌పల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి స్థానిక ఎన్నికల బరిలోకి దిగనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌తోనే కొనసాగుతున్న బండా నరేందర్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీకి విధేయుడిగా పేరున్న ఆయనకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వరించింది. గతంలో ఆయన స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లోనూ పోటీచేశారు. నాడు తాము గెలిచే అవకాశం ఏమాత్రం లేకున్నా.. పార్టీ నాయకత్వం ఆయనను స్థానికసంస్థల ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయమని ఆదేశించడంతో పోటీపడ్డారు.

పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నెరవేర్చుకుంటూ పోతున్న ఆయన విధేయతను మెచ్చే గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ జెడ్పీ చైర్మన్‌ పదవికి అభ్యర్థిగా ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్‌ కూడా వెలువడలేదు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లోని పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జెడ్పీ చైర్మన్‌ పోస్టుకు పార్టీ నేతల మధ్య జరుగుతున్న రేసుకు చెక్‌ పెట్టేందుకు అధినాయకత్వం బండా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి, ఈ మేరకు జిల్లా నాయకత్వానికి సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ శుక్రవారం బండా నరేందర్‌రెడ్డికి నేరుగా ఫోన్‌ చేసి చైర్మన్‌ పదవికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, బండా గురువారమే తన చైర్మన్‌ పదవికి రాజీనామా చేయగా, ప్రభుత్వం శుక్రవారం ఆమోదించిందని చెబుతున్నారు. దీంతో ఆయన జెడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గెలుపు ధీమాలో గులాబీ శ్రేణులు..
బండా నరేందర్‌రెడ్డి తన సొంత మండలం నార్కెట్‌పల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలోకి దిగనునన్నారని చెబుతున్నారు. ఈసారి జిల్లా పరిషత్‌ జనరల్‌ కేటగిరీకి రిజర్వు అయ్యింది. నార్కట్‌పల్లి జెడ్పీటీసీ స్థానం కూడా జనరల్‌కే కేటాయించడంతో బండాకు అవకాశం కలిసి వచ్చిందని పేర్కొంటున్నారు. నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థిని ప్రకటించి ఒక విధంగా విపక్షాలకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం సవాలు విసిరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 31 జెడ్పీటీసీ స్థానాలున్న నల్లగొండ జిల్లా పరిషత్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే 16 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంటే సరిపోతుంది. కాగా, ఇటీవల జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైపు ఓటర్లు ఎక్కువగా మొగ్గుచూపారు.

దీంతో నల్లగొండ జిల్లా పరిధిలోని నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలు మినహా మిగిలిన నాలుగు చోట్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు విజయం సాధించా రు. నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నెల రోజుల కిందటే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్నట్లయ్యింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమా టీఆర్‌ఎస్‌ నాయకత్వంలో ఉంది. నల్లగొండ, మిర్యాలగూడ తదితర నియోజకవర్గాల నుంచి కొందరు నాయకులు జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. కాగా, బండా పేరును ఖరారు చేయడంతో వారి ప్రయత్నాలకు చెక్‌ పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement