* తెలంగాణ పుర పీఠాల ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్
* అత్యధిక వార్డులు గెలుచుకున్నా దక్కని ఫలితం
* బలమున్న స్థానాల్లోనూ చిత్తయిన వైనం
* ఫలించిన టీఆర్‌ఎస్ వ్యూహాలు, ఊహించనివీ కైవసం
* మజ్లిస్ మద్దతుతో మూడు కార్పొరేషన్లూ గులాబీ పరం
* రామగుండం, నిజామాబాద్‌లలో ఎక్కువ స్థానాలున్నా డీలా పడిన కాంగ్రెస్
* టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెరో 20 మున్సిపల్ చైర్మన్ పీఠాలు
* పరోక్షంగా మరో రెండూ అధికార పార్టీ ఖాతాలోకే
* బోర్లాపడ్డ తెలుగుదేశం.. నాలుగింటికే పరిమితం
* మూడు పట్టణాల్లో వికసించిన కమలం
* నల్లగొండ, సూర్యాపేట చైర్మన్ ఎన్నిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: ‘స్థానిక’ పీఠాల కోసం జరిగిన పోరులో కాంగ్రెస్ చిత్తయింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ వేసిన ఎత్తుగడలకు విపక్షం కంగుతినాల్సి వచ్చింది. తెలంగాణలోని పురపాలక సంఘాల అధ్యక్ష పదవులకు గురువారం నిర్వహించిన ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. తగిన బలమున్నప్పటికీ పలు పట్టణాల్లో కాంగ్రెస్ చతికిలపడింది. ఇతర పార్టీల కన్నా ఎక్కువ మంది సభ్యులున్నా కూడా అధ్యక్ష పీఠాలను చేజార్చుకుంది.
స్థానికంగా పట్టు సాధించడానికి పన్నిన వ్యూహాలకు తోడు ఎంఐఎం మద్దతు లభించడంతో టీఆర్‌ఎస్ బాగా లబ్ధి పొందింది. దీంతో కనీసం 27 స్థానాలు దక్కుతాయని అంచనా వేసిన కాంగ్రెస్ చివరకు 20 పీఠాలకే పరిమితమైంది. గులాబీ దండు మాత్రం కొన్ని అనుకోని స్థానాలనూ గెలుచుకోగలిగింది. ఇక నాలుగే స్థానాలు దక్కించుకున్న టీడీపీకి ఈ ఎన్నికలు పూర్తి నిరాశ మిగిల్చగా.. మూడింట్లో కమలం వికసించింది! స్వతంత్ర అభ్యర్థులు సైతం మూడు చైర్మన్ పదవులను నెగ్గడం విశేషం.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 53 పురపాలక సంఘాల చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా.. 51 మున్సిపాలిటీల్లోనే ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. తగినంత మంది సభ్యులు (కోరం) అందుబాటులో లేకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల మేయర్ పదవులు మూడూ టీఆర్‌ఎస్‌కే దక్కాయి. సాంకేతికంగా ఈ మూడింటిలో ఎక్కడా ఆ పార్టీకి సాధారణ మెజారిటీ లేదు. మజ్లిస్, ఇతరుల మద్దతుతోనే మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది.
రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించినప్పటికీ.. మజ్లిస్ దూరం కావడంతో వాటిని చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో మజ్లిస్ కూడా సత్తా చాటుకుంది. భైంసా మున్సిపాలిటీలో పాగా వేయడంతో పాటు టీఆర్‌ఎస్ సహకారంతో పలు వైస్‌చైర్మన్ పదవులను సాధించింది. కాగా, ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్‌అఫీషియో ఓట్లు కూడా అధికార పార్టీకి బాగా కలిసొచ్చాయి. రామగుండం కార్పొరేషన్‌తోపాటు పలు మున్సిపాలిటీల్లో గెలుపునకు అవి దోహదపడ్డాయి
మెజారిటీ సీట్లున్నా...
వాస్తవానికి మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులను కైవసం చేసుకున్న పార్టీ కాంగ్రెస్సే. మొత్తం 1,399 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా ఆ పార్టీ ఏకంగా 527 స్థానాలను సాధించింది. టీఆర్‌ఎస్ పార్టీ 312 వార్డులతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు పార్టీల మధ్య 215 వార్డులు తేడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు కనీసం 27 మున్సిపల్ పీఠాలు దక్కుతాయని ఆ పార్టీ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. తీరా చైర్మన్ పదవులకు జరిగిన తాజా ఎన్నికల్లో అది సాధారణ పోటీదారుగా మారిపోయింది. ఎక్కువ మంది సభ్యులున్నా అధికార పార్టీని నిలవరించలేకపోయింది.
స్పష్టమైన మెజారిటీ కలిగిన మంచిర్యాలలోనూ ఓటమి పాలైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహించిన జనగాం మున్సిపాలిటీలో 28 వార్డులకుగాను 14 స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీ ఎత్తులకు చిత్తయింది. ఫలితంగా 5 స్థానాలకే పరిమితమైన టీఆర్‌ఎస్‌కు చైర్మన్ పదవిని అప్పగించాల్సి వచ్చింది. ఈసారి మజ్లిస్, సీపీఎం, సీపీఐ పార్టీలు పలు చోట్ల టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడం విశేషం. ఇక తెలంగాణలో 161 వార్డులను గెలుచుకుని మూడో స్థానంలో నిలిచిన తెలుగు తమ్ముళ్లు.. ఆ నిష్పత్తిలోనే చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. కనీసం 8 మున్సిపాలిటీలనైనా తన ఖాతాలో వేసుకోవాలని భావించినప్పటికీ అందులో సగానికే ఆ పార్టీ పరిమితమైంది.
ఉప్పూనిప్పు కలసిన వేళ...
సిద్ధాంతపరంగా ఉప్పూనిప్పుగా మారిన కాంగ్రెస్, బీజేపీలు నాగర్‌కర్నూలు మున్సిపాలిటీలో చేతులు కలిపాయి. బీజేపీ మద్దతుతో ఇక్కడి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు అదృష్టం కలిసొచ్చింది. పరకాలలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్.. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశమున్నప్పటికీ తమ తరఫున ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి మార్తరాజయ్యకు పుర పీఠాన్ని అప్పగించాల్సి వచ్చింది.
అలాగే మధిరలో టీడీపీ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్.. అక్కడి స్వతంత్ర అభ్యర్థి నాగరాణికి మద్దతు పలకడంతో ఆమె చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక నిర్మల్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్, బీఎస్పీ కౌన్సిలర్లు కలిసి చైర్మన్ పదవిని దక్కించుకున్నాయి. అయితే ఈ పదవి సాంకేతికంగా స్వతంత్ర అభ్యర్థికి దక్కినట్లే. ఇక్కడ చైర్మన్‌గా ఎన్నికైన గణేష్ చక్రవర్తి బీఎస్పీ తరఫున కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడంతో గణేష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి చైర్మన్ అయ్యారు. రాష్ట్రమంతటా సత్తా చాటిన అధికార పార్టీ ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది.
చేతులెత్తేశారు..!
Published Fri, Jul 4 2014 1:57 AM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM
Advertisement
Advertisement