local polls 2014
-
ఒకట్రెండు జెడ్పీలు గెలవపోతే నష్టమేంటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్ధానిక ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యకరంగా వ్యవహరించిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకటి, రెండు జెడ్పీలు గెలవకపోతే టీడీపీకి వచ్చే నష్టమేంటని టీడీపీని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జడ్పీ ఎన్నికలో కోరం ఉన్నప్పటికీ ఎన్నిక వాయిదా వేయడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. మెజారిటీ లేకపోయినప్పటికీ నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. పంటల రుణమాఫీపై చంద్రబాబు విధానాలు రైతులను గందరగోళపరుస్తున్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు ముందు రుణాలు చెల్లిస్తే తర్వాత డబ్బులివ్వాలన్న చంద్రబాబు ఆలోచన సరికాదన్నారు. రుణాలు మాఫీచేయకపోతే రైతులే చంద్రబాబును నిలదీస్తారని హెచ్చరించారు. -
'కూర్చోండి.. లేకుంటే బయటకు వెళ్లండి'
నెల్లూరు: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పెంచలమ్మను సమావేశం హాలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తొలగించేందుకు టీడీపీ సభ్యులు యత్నించడంతో నిబంధనలు ఉల్లంఘించొద్దని కలెక్టర్ హెచ్చరించారు. ఆరుగురు వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యులు టీడీపీ వరుసలోకి వెళ్లారు. ఆయా పార్టీ సభ్యులు వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలని కలెక్టర్ సూచించారు. వారు పట్టించుకోకపోవడంతో బయటకు వెళ్లిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో నలుగురు వైఎస్ఆర్ సీపీ సభ్యులను పోలీసులు బయటకు పంపారు. అయితే ఇద్దరు మాత్రం లోపలే ఉన్నారు. సీక్రెట్ ఓటింగ్ జరిపించాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది. టీడీపీ సభ్యుల డిమాండ్ ను కలెక్టర్ తిరస్కరించారు. -
దేవరపల్లిలో ‘దేశం’ దొంగాట
ఏలూరు: అధికారదాహంతో తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా అధికారం దక్కకుండా చేయాలని అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిషత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ ఎంపీపీ పదవిని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉద్రిక్తతలు సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేసిన ఆ పార్టీ నేతలు ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లోనూ శాంతిభద్రతల సమస్య తీసుకురావాలని కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకత్వాన్ని, అల్లరి మూకలను ఆరోజు దేవరపల్లి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రయత్నాలనూ అడ్డుకుంటున్నారు. ఇదీ జరిగింది దేవరపల్లి మండల పరిషత్‌లో 22 ఎంపీటీసీ స్థానాలకుగాను 12 వైఎస్సార్ సీపీ, 9 టీడీపీ గెల్చుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన పెనుబోతుల సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీపీ పదవికి గన్నమని జనార్దనరావు పోటీకి దిగారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల్ని భయపెట్టో, ప్రలోభపెట్టో తమవైపు తిప్పుకొని ఎంపీపీ పదవి దక్కించుకోవాలని టీడీపీ పథకం వేసింది. ఈ కుతంత్రాలకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు లొంగలేదు. ఈనెల నాలుగున ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. టీడీపీ శ్రేణులు ఆ రోజున దేవరపల్లిలో అరాచకం సృష్టించాయి. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల సభ్యులపై దౌర్జన్యానికి దిగటమేగాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామారావుపైనా దాడిచేశారు. దీంతో ఎన్నికల్ని ఆపేసిన ఎన్నికల సంఘం.. అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. మళ్లీ ఈనెల 13న ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించటంతో ఆరోజున మళ్లీ దౌర్జన్యాలకు పాల్పడాలని టీడీపీ కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలని, లేకపోతే శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం మంత్రులు కూడా అక్కడే మకాం వేయనున్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలు సక్రమంగా జరిగేలా రక్షణ కల్పించాలని వైఎస్సార్ సీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. టీడీపీకి కొమ్ముకాస్తున్న అధికారులు దేవరపల్లిలో ఈనెల 4న జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు టీడీపీకి చెందిన వారిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయని పోలీసు అధికారులు వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆరుగురిలో ఎంపీపీ అభ్యర్థి కుమారుడు గన్నమనేని వెంకటేశ్వరావు, వైఎస్సార్ సీపీ నేత కొఠారు దొరబాబులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వారు బుధవారం బెయిల్ తీసుకోవడానికి కోర్టుకు వెళితే అక్కడా పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆవరణలో నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తమ హక్కులకు భంగం కలిగించిన కొవ్వూరు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలపై బాధితులు గురువారం ఎస్పీకి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. కోర్టు ఆవరణలో పోలీసుల దౌర్జన్యాన్ని న్యాయవాదులు తీవ్రంగా పరిగణించారు. జిల్లా జడ్జికి, సెషన్స్ జడ్జికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం వారంతా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ఆందోళన చేయనున్నారు. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు తమ ప్రాణాలకు భద్రత, హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దేవరపల్లి మండల పరిషత్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోమని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల్లో పొటీచేసే అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పించి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. అయితే.. అధికారం అండతో ఎవరినీ లెక్కచేయకుండా దాడులకు తెగబడుతున్న టీడీపీ వారు ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఏ అరాచకం సృష్టిస్తారోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
'జెడ్పీటీసీ బంధువులను ప్రలోభపెడుతున్న టీడీపీ'
నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీ బంధువులను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఒక్కరు వస్తే చాలనీ అందరినీ అడుగుతున్నారని వెల్లడించారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు కార్పొరేషన్ తరహాలోనే జిల్లా పరిషత్ ను గెల్చుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మండలాధ్యక్ష ఎన్నికల్లోనూ, నిన్న జరిగిన పురపాలక ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. -
చేతులెత్తేశారు..!
* తెలంగాణ పుర పీఠాల ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ * అత్యధిక వార్డులు గెలుచుకున్నా దక్కని ఫలితం * బలమున్న స్థానాల్లోనూ చిత్తయిన వైనం * ఫలించిన టీఆర్ఎస్ వ్యూహాలు, ఊహించనివీ కైవసం * మజ్లిస్ మద్దతుతో మూడు కార్పొరేషన్లూ గులాబీ పరం * రామగుండం, నిజామాబాద్‌లలో ఎక్కువ స్థానాలున్నా డీలా పడిన కాంగ్రెస్ * టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెరో 20 మున్సిపల్ చైర్మన్ పీఠాలు * పరోక్షంగా మరో రెండూ అధికార పార్టీ ఖాతాలోకే * బోర్లాపడ్డ తెలుగుదేశం.. నాలుగింటికే పరిమితం * మూడు పట్టణాల్లో వికసించిన కమలం * నల్లగొండ, సూర్యాపేట చైర్మన్ ఎన్నిక వాయిదా సాక్షి, హైదరాబాద్: ‘స్థానిక’ పీఠాల కోసం జరిగిన పోరులో కాంగ్రెస్ చిత్తయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ వేసిన ఎత్తుగడలకు విపక్షం కంగుతినాల్సి వచ్చింది. తెలంగాణలోని పురపాలక సంఘాల అధ్యక్ష పదవులకు గురువారం నిర్వహించిన ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. తగిన బలమున్నప్పటికీ పలు పట్టణాల్లో కాంగ్రెస్ చతికిలపడింది. ఇతర పార్టీల కన్నా ఎక్కువ మంది సభ్యులున్నా కూడా అధ్యక్ష పీఠాలను చేజార్చుకుంది. స్థానికంగా పట్టు సాధించడానికి పన్నిన వ్యూహాలకు తోడు ఎంఐఎం మద్దతు లభించడంతో టీఆర్ఎస్ బాగా లబ్ధి పొందింది. దీంతో కనీసం 27 స్థానాలు దక్కుతాయని అంచనా వేసిన కాంగ్రెస్ చివరకు 20 పీఠాలకే పరిమితమైంది. గులాబీ దండు మాత్రం కొన్ని అనుకోని స్థానాలనూ గెలుచుకోగలిగింది. ఇక నాలుగే స్థానాలు దక్కించుకున్న టీడీపీకి ఈ ఎన్నికలు పూర్తి నిరాశ మిగిల్చగా.. మూడింట్లో కమలం వికసించింది! స్వతంత్ర అభ్యర్థులు సైతం మూడు చైర్మన్ పదవులను నెగ్గడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 53 పురపాలక సంఘాల చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా.. 51 మున్సిపాలిటీల్లోనే ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. తగినంత మంది సభ్యులు (కోరం) అందుబాటులో లేకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల మేయర్ పదవులు మూడూ టీఆర్ఎస్కే దక్కాయి. సాంకేతికంగా ఈ మూడింటిలో ఎక్కడా ఆ పార్టీకి సాధారణ మెజారిటీ లేదు. మజ్లిస్, ఇతరుల మద్దతుతోనే మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది. రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించినప్పటికీ.. మజ్లిస్ దూరం కావడంతో వాటిని చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో మజ్లిస్ కూడా సత్తా చాటుకుంది. భైంసా మున్సిపాలిటీలో పాగా వేయడంతో పాటు టీఆర్ఎస్ సహకారంతో పలు వైస్‌చైర్మన్ పదవులను సాధించింది. కాగా, ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్అఫీషియో ఓట్లు కూడా అధికార పార్టీకి బాగా కలిసొచ్చాయి. రామగుండం కార్పొరేషన్‌తోపాటు పలు మున్సిపాలిటీల్లో గెలుపునకు అవి దోహదపడ్డాయి మెజారిటీ సీట్లున్నా... వాస్తవానికి మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులను కైవసం చేసుకున్న పార్టీ కాంగ్రెస్సే. మొత్తం 1,399 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా ఆ పార్టీ ఏకంగా 527 స్థానాలను సాధించింది. టీఆర్ఎస్ పార్టీ 312 వార్డులతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు పార్టీల మధ్య 215 వార్డులు తేడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు కనీసం 27 మున్సిపల్ పీఠాలు దక్కుతాయని ఆ పార్టీ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. తీరా చైర్మన్ పదవులకు జరిగిన తాజా ఎన్నికల్లో అది సాధారణ పోటీదారుగా మారిపోయింది. ఎక్కువ మంది సభ్యులున్నా అధికార పార్టీని నిలవరించలేకపోయింది. స్పష్టమైన మెజారిటీ కలిగిన మంచిర్యాలలోనూ ఓటమి పాలైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహించిన జనగాం మున్సిపాలిటీలో 28 వార్డులకుగాను 14 స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీ ఎత్తులకు చిత్తయింది. ఫలితంగా 5 స్థానాలకే పరిమితమైన టీఆర్ఎస్కు చైర్మన్ పదవిని అప్పగించాల్సి వచ్చింది. ఈసారి మజ్లిస్, సీపీఎం, సీపీఐ పార్టీలు పలు చోట్ల టీఆర్ఎస్కు మద్దతివ్వడం విశేషం. ఇక తెలంగాణలో 161 వార్డులను గెలుచుకుని మూడో స్థానంలో నిలిచిన తెలుగు తమ్ముళ్లు.. ఆ నిష్పత్తిలోనే చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. కనీసం 8 మున్సిపాలిటీలనైనా తన ఖాతాలో వేసుకోవాలని భావించినప్పటికీ అందులో సగానికే ఆ పార్టీ పరిమితమైంది. ఉప్పూనిప్పు కలసిన వేళ... సిద్ధాంతపరంగా ఉప్పూనిప్పుగా మారిన కాంగ్రెస్, బీజేపీలు నాగర్‌కర్నూలు మున్సిపాలిటీలో చేతులు కలిపాయి. బీజేపీ మద్దతుతో ఇక్కడి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు అదృష్టం కలిసొచ్చింది. పరకాలలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశమున్నప్పటికీ తమ తరఫున ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి మార్తరాజయ్యకు పుర పీఠాన్ని అప్పగించాల్సి వచ్చింది. అలాగే మధిరలో టీడీపీ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్.. అక్కడి స్వతంత్ర అభ్యర్థి నాగరాణికి మద్దతు పలకడంతో ఆమె చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక నిర్మల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, బీఎస్పీ కౌన్సిలర్లు కలిసి చైర్మన్ పదవిని దక్కించుకున్నాయి. అయితే ఈ పదవి సాంకేతికంగా స్వతంత్ర అభ్యర్థికి దక్కినట్లే. ఇక్కడ చైర్మన్‌గా ఎన్నికైన గణేష్ చక్రవర్తి బీఎస్పీ తరఫున కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఇటీవల టీఆర్ఎస్లో చేరడంతో గణేష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి చైర్మన్ అయ్యారు. రాష్ట్రమంతటా సత్తా చాటిన అధికార పార్టీ ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది.