ఎన్ని ఎత్తులు వేసినా టీఆర్‌ఎస్‌దే గెలుపు   | TRS will Win Says Kavitha | Sakshi
Sakshi News home page

ఎన్ని ఎత్తులు వేసినా టీఆర్‌ఎస్‌దే గెలుపు  

Published Thu, Nov 15 2018 4:12 PM | Last Updated on Thu, Nov 15 2018 4:12 PM

TRS will Win Says Kavitha - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ కవిత 

సాక్షి, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రం సిద్ధించకుండా కుట్రలు, కుతంత్రాలు పన్నిన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రస్తుతం ఇక్కడి అభివృద్ధిని సైతం అడ్డుకుంటున్నాడని..ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణ అభివృద్ధి ఆగదని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట కవిత అన్నారు. బుధవారం సాయంత్రం ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం బ్రాహ్మణ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో నాలుగున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని..కోట్లాది రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో లిఫ్ట్‌ ఇరిగేషన్ల ఏర్పాటుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందన్నారు. 

అభివృద్ధిని ఓర్వలేక చంద్రబాబు కాంగ్రెస్, ఇతర పార్టీలతో జతకట్టి కుట్రపన్ని మహాకూటమిగా ఏర్పడ్డారని.. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తోందని.. ముఖ్యమంత్రి కేసీఆరేనని తేల్చి చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో అతి తక్కువ కాలంలో 11 వందల కోట్ల అభివృద్ధి జరిగిందని..మేజర్‌ పంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీగా ఏర్పడడం ఎంతో గొప్ప విషయమని..పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్‌ చొరవతో ఇప్పటికే రూ.75 కోట్లు మంజూరయ్యాయని..  ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌ అధికారంలో రాగానే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. గతంలో మున్సిపాలిటీల అభివృద్ధికి పన్నులు వసూలు చేసేవారని.. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్‌ నుంచి నిధులు మంజూరు చేయడం జరగుతుందన్నారు. గత పాలకుల హయాంలో రోళ్లవాగు ప్రాజెక్టు నిరాధరణకు గురైందని..రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాజెక్టు మరమ్మతుకు సీఎం రూ.135 కోట్లు మంజూరు చేశారన్నారు. నృసింహుని కృపతో ధర్మపురి పుణ్యక్షేత్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. సమావేశంలో ధర్మపురి, జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్, సంజీవ్‌కుమార్, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదినేని రాజేందర్, ఆలయ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రాజేశ్, నాయకులు సౌళ్ల భీమయ్య, ఇందారపు రామయ్య, పులిశెట్టి మల్లేశం, సంగి శేఖర్‌ తదితరులున్నారు.

నృసింహుని సన్నిధిలో పూజలు
ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఎంపీ కవిత  దర్శించుకున్నారు. ముందుగా ఆలయం తరఫున ఆమెకు స్వాగతం పలికారు. శ్రీయోగానందాస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement