సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఫలితాలను రాబడుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కో స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఏడో విడత ఎన్నికల పోలింగ్ ముగింపుతో నేటితో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సమాప్తమైన విషయం తెలిసిందే.
మీడియా సంస్థ | టీఆర్‌ఎస్ | కాంగ్రెస్ | ఎంఐఎం | బీజేపీ |
టుడేస్ చాణక్య | 12-16 | 0-2 | 0-1 | 0-2 |
ఇండియా టుడే | 10-12 | 1-3 | 0-1 | 1-3 |
ఇండియా టీవీ | 14 | 02 | 01 | 00 |
న్యూస్18 | 12-14 | 1-2 | 01 | 1-2 |
ఏబీపీ | 16 | 0 | 01 | 00 |
వీడీపీఏ | 16 | 0 | 01 | 0 |
కారు జోరు..
కాగా 16 ఎంపీ స్థానాలే లక్ష్యంగా కేసీఆర్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే మరోసారి పునరావృత్తం చేయాలని కేసీఆర్ భావించారు. హైదరాబాద్ స్థానం తప్ప మిగిలిన స్థానాల్లో టీఆర్‌ఎస్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేతలు అంచనావేస్తున్నారు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 119 స్థానాల్లో 88 స్థానాలను గెలుచుకుని విజయ కేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో గులాబీ గూటికి చేరుకున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బతీసింది టీఆర్‌ఎస్ దళం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 11 సీట్లు కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 2, టీడీపీ 1, వైఎస్సార్‌సీపీ 1, ఎంఐఎం 1, బీజేపీ 1 సీట్లు గెలుచుకున్నాయి.
ఆవిరైన హస్తం ఆశలు..
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంచుకున్నట్లు కనిపించినా తెలంగాణలో మాత్రం దారుణమైన ఫలితాలు చూవిచూసిందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. గత ఫలితాలనే పునారావృత్తం చేస్తూ.. కారు పార్టీ ఈసారి కూడా జోరు కొనసాగించింది. కనీసం ఐదారు స్థానాల్లో విజయం సాధిస్తామనుకున్న కాంగ్రెస్‌కు ఎగ్జిట్ పోల్స్ చేదు ఫలితాలనే మిగిల్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, జనసమితితో జట్టు కట్టిన హస్తం పార్టీ.. కూటమి బెడిసికొట్టడంతో ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగింది. అయినా కూడా అవే ఫలితాలను చవిచూడాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment