సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏడాది ముందు నుంచే అధికార టీఆర్‌ఎస్ కార్యాచరణకు నడుం బిగిస్తోంది. జనహిత తరహాలో భారీ జనసభలకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కులాలు, వర్గాల వారీగా ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన నివాసం ప్రగతి భవన్‌లో జనహిత సమావేశాలు నిర్వహించారు. రైతులు, జర్నలిస్టులు, పాడి రైతులు, చేనేతలు, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు.. ఇలా వరుసగా వివిధ వర్గాలను సమావేశపరిచి వారితో ముఖాముఖి మాట్లాడారు. పలు సందర్భాల్లో అందరితో కలిసి భోజనం చేశారు. క్షేత్రస్థాయిలో వారి సమస్యలను అడిగి తెలుసుకోవటంతోపాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రచారం చేసే దిశగా ఈ సభలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సమావేశాలకు ఎంపిక చేసిన గ్రామాలు, జిల్లాల నుంచే కొద్ది మందిని ప్రత్యేకంగా ఆహ్వానించిన టీఆర్‌ఎస్ శ్రేణులు.. ఇకపై భారీ జనసభల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే సీఎం.. పార్టీ ముఖ్య నేతలను ఈ దిశగా కార్యాచరణకు పురమాయించినట్లు సమాచారం.
ప్రధానంగా కులాల వారీగా జనాన్ని మోహరించాలని, వివిధ పథకాలతో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కులాలను సమీకరించి రాష్ట్రమందరి దృష్టిని ఆకర్షించేల ఈ సభలను ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. వచ్చేనెల నుంచే ఈ జన సభలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మార్చి నుంచి వరుసగా కులాల వారీగా నెలకో భారీ బహిరంగ సభ నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా గొల్ల, కుర్మలు, ముదిరాజ్, గంగపుత్ర కుల సభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలకు ముందే కులాల వారీగా వీలైనన్ని తాయిలాలు ప్రకటించటంతోపాటు ప్రభుత్వం తరఫున ఇప్పటికే హామీ ఇచ్చిన కార్యక్రమాలను కూడా ప్రారంభించి తీరాలని సీఎం పట్టుదలతో ఉన్నారు.
జనాభా ఎక్కువున్న కులాలకు పెద్దపీట
జనసభల్లో భాగంగానే కొన్ని ముఖ్యమైన కుల సంఘాలకు హైదరాబాద్‌లో స్థలాలు కేటాయించనున్నారు. బీసీ ఓట్లను ఆకర్షించే దిశగా ఎక్కువ జనాభా ఉన్న కులాలకు ప్రాధాన్యమిచ్చేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాలో ముదిరాజ్, గొల్ల, కుర్మలు, గౌడ, చేనేత కులాలది అగ్రస్థానం. ముదిరాజ్, గొల్ల, కుర్మల్లో దాదాపు 50 లక్షల మంది ఓటర్లున్నట్లు టీఆర్‌ఎస్ అంచనాకు వచ్చింది. ముందుగా ఈ మూడు కులాలపై దృష్టి సారించింది. ఇప్పటికే 7 లక్షల మంది గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేస్తోంది. ముదిరాజ్, గంగపుత్రులకు మేలు చేసేలా ప్రతీ ఏడాది ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. చేనేతలకు రుణమాఫీతోపాటు ఉచితంగా నూలు, రసాయనాలను అందిస్తోంది. వాస్తవానికి బీసీ కులాలను ఆకర్షించే ప్రయత్నాలను బడ్జెట్ నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించింది. ఇప్పుడు ఈ వర్గాలన్నింటినీ ఆకట్టుకొని, ఓటు బ్యాంకుగా తమవైపు మలుచుకోవాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
నాలుగైదు లక్షల మందితో గొల్ల కుర్మ సభ
జనసభలకు భారీగా జనాన్ని తరలించేలా టీఆర్‌ఎస్ వ్యూహరచన చేసింది. ముందుగా నాలుగైదు లక్షల మందితో గొల్ల, కుర్మ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మార్చిలో హైదరాబాద్‌లో ఈ సభ పెట్టాలని నిర్ణయించింది. ముందుగా జిల్లాల వారీగా సన్నాహక సభలు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు భారీగా జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటోంది. వీటిని గొల్ల, కుర్మ సంఘాలతోపాటు టీఆర్‌ఎస్ శ్రేణులన్నీ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సీఎం ఇప్పటికే పార్టీ ముఖ్యులకు సూచనలు చేసినట్లు తెలిసింది. అన్ని బహిరంగ సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. ఇందులో భాగంగానే గొల్ల, కుర్మలకు వేర్వేరుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదెకరాల చొప్పున స్థలం కేటాయించనున్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో గొల్ల భవన్, కుర్మ భవన్, వేర్వేరుగా హాస్టళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలోనే సీఎం వీటికి శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ తర్వాత ముదిరాజ్, గంగపుత్ర సభ, గౌడ సభలకు ప్రణాళిక రూపొందించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment