సాక్షి, హైదరాబాద్ : కేసుల కారణంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కొంత ఆలస్యమైందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. సమయం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోర్టు సూచించినట్లు తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్పోరేషన్ల కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజనపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. కోర్టు.. ప్రభుత్వాన్ని ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కోరిందన్నారు. 14వ తేదీ నాడు తుది ఓటర్ల జాబితా ప్రకటన ఉంటుందని తెలిపారు. చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. గురువారం మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. 12వ తేదీనాడు మళ్లీ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.
ఓటర్ల జాబితాను అందరికి అందుబాటులో ఉంచాలని సూచించారు. 14వ తేదీ నాడు తుది జాబితా విడుదల చెయ్యాలని, ఆ నాడే పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి లిస్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే వార్డుల పునర్విభజన చేసినందుకు, తక్కువ సమయంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తునందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఓటర్ల జాబితా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన కార్యాలయాలలో ఓటర్ల జాబితా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా జరిపేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment