
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిర్మాణానికి 12 నెలల సమయం పడుతుందని పేర్కొంది. సచివాలయాన్ని కూల్చి నూతనంగా అన్ని హంగులతో అత్యాధునిక వసతులతో భావితరాలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.