ఇంటికో నజరానా..
కొత్తగా వ్యక్తిగత లబ్ధి పథకాలపై సర్కారు ఫోకస్
- ప్రస్తుత పథకాలు, కార్యక్రమాల రీడిజైన్‌పైనా దృష్టి
- అర కోటి కుటుంబాలకు చేరేలా బీసీ, ఎంబీసీ కార్యక్రమాలు
- మరిన్ని ‘ఆసరా’ పింఛన్ల మంజూరుకు నిర్ణయం
- మరో లక్ష మంది బీడీ కార్మికులకు పెన్షన్లు
- జూన్ నుంచి గొర్రెల పంపిణీ..
- ఈ ఏడాది లక్ష కుటుంబాలకు ప్రయోజనం
- నెలనెలా పక్కాగా పెంచిన మెస్ చార్జీల పంపిణీ
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటికో లబ్ధిదారు ఉండేలా.. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు చేపట్టడంపై సర్కారు దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న పథకాలను మరింత విస్తరించడం, బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలతో పాటు మరిన్ని కొత్తవి చేపట్టేలా వ్యూహరచన చేస్తోంది. మొత్తంగా నేరుగా లబ్ధి పొందే వారి సంఖ్యను వీలైనంతగా పెంచే లక్ష్యంతో పథకాలను రీడిజైన్ చేయనుంది. ఇందులో భాగంగా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల అమలుపై కసరత్తు వేగవంతం చేసింది. ఇంటింటికీ సర్కారు కానుక అందించినట్లుగా ఉండేలా కార్యక్రమాలను మలిచేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాదిలోనే..
తాజా బడ్జెట్‌లో పొందుపరిచిన పథకాలతో పాటు ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాలను ఈ ఏడాదిలో పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ప్రాధాన్యంగా ఎంచుకున్న గొర్రెల పంపిణీ, బీసీ, ఎంబీసీ కులాల అభ్యున్నతికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో.. ఆయా వర్గాల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని జూన్ నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ఏడాది లక్ష యాదవ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా సమగ్ర ప్రణాళికను పశు సంవర్థక శాఖ సిద్ధం చేస్తోంది.
ఎంబీసీ పథకాలపై కసరత్తు
ఎంబీసీలకు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలి, ఇంటింటికీ లబ్ధి చేకూరేలా ఎలాంటి పథకాలను డిజైన్ చేయాలనే అంశాలపై కసరత్తును కొత్తగా ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్‌కు అప్పగించారు. వీలైనంత త్వరగా కార్పొరేషన్ పాలకమండలి ఏర్పాటు చేసి, సిబ్బందిని కేటాయించి.. కసరత్తును వేగవంతం చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎంబీసీ, బీసీల అభ్యున్నతికి చేపట్టే పథకాలు గ్రామాల్లో ఆయా వర్గాల ఇంటింటికీ చేరేలా ఉండాలని స్పష్టం చేశారు. దీంతో అదే దిశగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పనకు కసరత్తు మొదలైంది. బడ్జెట్‌లో ప్రభుత్వం ఎంబీసీలకు రూ.వెయ్యి కోట్లు, రజక, నాయీబ్రాహ్మణులకు రూ.500 కోట్లు, విశ్వకర్మలకు రూ.200 కోట్లు, చేనేతలకు రూ.1,200 కోట్లు కేటాయించింది. వీటి ద్వారా ఆయా వర్గాలకు చెందిన 50 లక్షల కుటుంబాలకు తొలి ఏడాదిలోనే ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల రూపకల్పనకు వ్యూహరచన చేస్తోంది.
పింఛన్ల సంఖ్య మరింతగా పెంపు!
తొలి ఏడాదిలోనే తమకు ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పించిన ఆసరా పెన్షన్లపైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కో ఇంట్లో ఒకే పింఛన్ ఇవ్వాలన్న నిబంధనను కూడా ఇటీవల సడలించింది. బీడీ కార్మికులున్న కుటుంబాల్లో ఎవరికైనా ఆసరా పింఛన్ అందుతున్నా సరే.. ఆ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులున్నా సరే.. బీడీ కార్మికులకు జీవనభృతి అందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.47 లక్షల మంది బీడీ కార్మికులు నెలకు రూ.వెయ్యి చొప్పున జీవన భృతి అందుకుంటున్నారు. తాజా నిర్ణయంతో మరో 81 వేల నుంచి లక్ష మంది వరకు లబ్ధి కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇక ఒంటరి మహిళలకు కూడా ఆసరా పింఛన్లను అందించాలని యోచిస్తోంది. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేతలు, గీత కార్మికులతో పాటు బీడీ కార్మికులు కలిపి 36 లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. అదనంగా పెరిగే బీడీ కార్మికులు, ఒంటరి మహిళల పింఛన్లతో ఈ సంఖ్య 38 లక్షలకు చేరనుంది. ఇవేగాకుండా అవసరమున్న చోట దరఖాస్తులను బట్టి మరో రెండు లక్షల పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి బడ్జెట్‌లో రూ.5,330 కోట్లను ఆసరా పింఛన్లకు కేటాయించారు. ఈ కేటాయింపులను బట్టి దాదాపు నలభై లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు అవకాశముంది.
కచ్చితంగా పంపిణీ..
పెంచిన మెస్ చార్జీలను సైతం ఈ ఏడాది పక్కాగా నెలనెలా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. స్కూలు, కాలేజీ విద్యార్థులు కలిపి దాదాపు 18 లక్షల మందికి మెస్ చార్జీల పెంపుతో ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో ఉండే అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, విలేజీ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగుల వేతనాలను పెంచారు. ఇక ఇటీవల అసెంబ్లీలో సీఎం హామీ ఇచ్చిన మేరకు హోంగార్డుల రెగ్యులరైజేషన్‌పైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 19 వేల మంది హోంగార్డులున్నారు. వారిని వివిధ ఉద్యోగాల్లో నియమించేందుకు అవసరమైన మార్గాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇవన్నీ వ్యక్తిగత లబ్ధి చేకూర్చటంతో పాటు ఇంటింటికీ సర్కారు కానుకను అందించినట్లు ఉండేలా కసరత్తు జరుగుతోంది.