
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో చెరువులు, కుంటలు, నీటితో నిండి కనువిందు చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులవల్ల అనారోగ్యం పాలవుతున్నారు. విషజ్వరాలు సైతం ప్రబలి మంచాలకే పరిమితమవుతున్నారు. జ్వరం, దగ్గు, నీళ్ల విరేచనాలతో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులవైపు పరుగులు పెడుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కొరతతో పాటు సరైన మందులు లేకపోవడంతో ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటూ ఆర్థికంగా ఇబ్బం దుల పాలవుతున్నారు. ఇదే అదనుగా భావిం చిన ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు తమ దగ్గరకు వచ్చే రోగులకు వివిధ రకాల పరీక్షలు, మందుల పేరిట అందినకాడికి డబ్బులు గుంజుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. వర్షాకాలంలో ప్రబలేవ్యాధులు, నివారణోపాయాలపై గ్రామాలవా రీగా సమావేశాలు పెట్టి అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత వైద్యశాఖపై ఉన్నప్పటికీ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
ఏజెన్సీ వాసులు నిరక్షరాస్యులు కావడం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో వ్యాధులతో బాధపడేవారికి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. విషజ్వరాలే కాకుండా వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ప్రభుత్వ దవాఖానా పట్ల నమ్మకం పెంచాలి. వైద్య వృత్తి పవిత్రతను కాపాడాలి.
-కామిడి సతీష్ రెడ్డి, జెడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ‘ 98484 45134
Comments
Please login to add a commentAdd a comment