బాటిళ్లలో పెట్రోల్‌ బంద్‌! | TS Govt Take Action For No Petrol In Plastic Bottles | Sakshi
Sakshi News home page

బాటిళ్లలో పెట్రోల్‌ బంద్‌!

Published Mon, Nov 11 2019 10:04 AM | Last Updated on Mon, Nov 11 2019 10:04 AM

TS Govt Take Action For No Petrol In Plastic Bottles - Sakshi

భిక్కనూరులోని ఓ పెట్రోల్‌ బంకులో ఏర్పాటు చేసిన బోర్డు

సాక్షి, కామారెడ్డి: సాధారణంగా బైక్‌పై తిరిగే వారికి ఎప్పుడో ఒకసారి పెట్రోల్‌ సమస్య తలెత్తుతుంది. వాహనంపై తిరిగినపుడు పెట్రోల్‌ పోసుకోవడం మరిచిపోయిన సందర్భంలో వాహనం ఆగిపోవడం, వెంటనే ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ను సంపాదించి దగ్గరలోని బంకుకు వెళ్లి పెట్రోల్‌ తెచ్చుకోవడం జరుగుతుంది. కొందరు తమ వాహనం పెట్రోల్‌ లేక ఆగిపోయిందని స్నేహితులకో, బంధువులకో ఫోన్‌ చేస్తే.. వారు బాటిళ్లలో పెట్రోల్‌ తీసుకువచ్చి ఇస్తుంటారు. ఇకపై ఇలా బాటిళ్లలో పెట్రోల్‌ తీసుకెళ్లడం కుదరదు.. ప్లాస్టిక్‌ బాటిళ్లలో పెట్రోల్‌ అమ్మడంపై సర్కారు ఆంక్షలు విధించింది. ఈ మేరకు అన్ని పెట్రోల్‌ బంకులలో బోర్డులు ఏర్పాటు చేశారు.  

ఇటీవలి కాలంలో హత్యలు, ఆత్మహత్యలకు పెట్రోల్‌ను వాడుతున్న సంఘటనలు పెరిగాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌పై సురేశ్‌ అనే వ్యక్తి తన వెంట ప్లాస్టిక్‌ బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై చల్లి సజీవదహనం చేసిన సంఘటన సంచలనం కలిగించింది. పెట్రోల్‌ చల్లి నిప్పంటించడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలొదిలింది. కిరోసిన్, డీజిల్‌ కన్నా పెట్రోల్‌ వేగంగా దహనం అవుతుంది. కొందరు ఆత్మహత్య చేసుకునే విషయంలో, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడానికి పెట్రోల్‌ సీసాలతో హల్‌చల్‌ చేసిన సంఘటనలున్నాయి. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు పెట్రోల్‌ అమ్మకాలకు సంబంధించి కొన్ని ఆంక్షలు విధించింది. బాటిళ్లలో ముఖ్యంగా ప్లాస్టిక్‌ బాటిళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్‌ పోయొద్దని ఆదేశించింది. దీంతో బంకుల యజమానులు ‘నో పెట్రోల్‌ ఇన్‌ ప్లాస్టిక్‌ బాటిల్‌’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట, ప్రధాన చౌరస్తాల వద్ద 40 కి పైగా పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. బాటిళ్లలో పెట్రోల్‌ పోయవద్దన్న ఆదేశాల నేపథ్యంలో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.  

బాటిళ్లలో సులువుగా పెట్రోల్‌ తీసుకెళ్లి వ్యక్తులపై పోసి నిప్పంటించడం గాని, తమకు తాము పోసుకుని కాల్చుకోవడం గాని జరగకుండా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుందని పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు అంటున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లలో పెట్రోల్‌ అయిపోయినా వాహనం తీసుకొస్తేనే పెట్రోల్‌ పోస్తామని పెట్రోల్‌బంక్‌ యజమాని ఒకరు ‘సాక్షి’తో తెలిపారు. ప్లాస్టిక్‌ బాటిళ్లలో పెట్రోల్‌ పోయవద్దని ప్రభుత్వంనుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement