సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక తప్పులే కాకుండా ఎక్కువపేపర్లు దిద్దాలన్న ఒత్తిడితో చేసిన వ్యాల్యుయేషన్లోనూ పొరపాట్లు దొర్లాయి. దీంతో చాలామంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ప్రస్తుతం చేస్తున్న రీవెరిఫికేషన్‌లో ఈ లోపాలు బయటపడుతున్నా యి. ఈ నేపథ్యంలో వాటిని సవరించేపనిలో ఇంటర్ బోర్డు పడింది. జవాబుపత్రాల మూల్యాంకన సమయంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వ్యాల్యుయేషన్ చేసే లెక్చరర్లకు పరిమితికి మించి జవాబుపత్రాలను పంపిం చారు.
దీంతో అక్కడి అధికారులు వ్యాల్యుయే షన్ చేయలేమంటూ చేతులెత్తేశారు. మిగిలిన వాటిని తిరిగి హైదరాబాద్‌కు తెప్పించి వ్యాల్యు యేషన్ చేయించారు. ఈ క్రమంలో ఒక్కో లెక్చరర్ చేత రోజూ దిద్దాల్సిన పేపర్ల సంఖ్య కంటే ఎక్కువ పేపర్లను దిద్దించారు. దీంతో పలువురు విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్లు రీవెరిఫికేషన్‌లో బయటపడింది. దీంతో వాటిని సవరించి ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
3 శాతం మంది పాస్ అయ్యే చాన్స్...
ఇంటర్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో ఫెయిల్ అయిన, సున్నా మార్కులు వచ్చిన, ఆబ్సెంట్ పడిన దాదాపు 3.28 లక్షల మంది విద్యార్థులకు చెందిన 12 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పలువురు విద్యార్థులు పాస్ అవుతున్నారు. మొత్తంగా ఫెయిల్ విద్యార్థుల్లో 3 శాతం మంది వరకు రీ వెరిఫికేషన్‌లో పాస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొందరు విద్యార్థులకు మొదట్లో తక్కువ మార్కులు రాగా, మరికొంత మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో 48,960 మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ రీ వెరిఫికేషన్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. మరో 10,576 వేల మంది రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ప్రస్తుతం వారి జవాబు పత్రాలతోపాటు సున్నా మార్కులు వచ్చిన, ఆబ్సెంట్ పడిన 3.28 లక్షల మందికి చెందిన 11 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒక విద్యార్థికి రీ వెరిఫికేషన్‌కు ముందు సంస్కృతంలో కేవలం 5 మార్కులే రాగా రీ వెరిఫికేషన్ తర్వాత 50 మార్కులు వచ్చినట్లు తెలిసింది. అలాగే మరో విద్యార్థి సివిక్స్‌లో 18 మార్కులతో ఫెయిల్ అవగా రీ వెరిఫికేషన్‌లో అతనికి 39 మార్కులు వచ్చి పాస్ అయినట్లు సమాచారం. ఇంకో విద్యార్థికి కూడా మ్యాథ్స్‌లో మొదట 18 మార్కులే రాగా రీ వెరిఫికేషన్‌లో 29 మార్కులు వచ్చి పాస్ అయినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment