ఇంధన పొదుపులో టీఎస్ ఆర్టీసీ టాప్
♦ రెండు జాతీయ స్థాయి అవార్డులు కైవసం
♦ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీకి తొలిసారి
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో దేశవ్యాప్తంగా రవాణా సంస్థల్లో టీఎస్‌ఆర్టీసీ ఉత్తమంగా నిలిచింది. బస్సులు సగటున లీటరు డీజిల్‌కు 5.46 కిలోమీటర్ల మైలేజీతో తెలంగాణ ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. దీంతో ప్రతిష్టాత్మక ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్స్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ)’ ప్రతి సంవత్సరం అందించే అవార్డుకు ఎంపికైంది. 2014-15 సంవత్సరానికి గాను టీఎస్‌ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. ఉమ్మడి ఆర్టీసీ దాదాపు 14 సార్లు ఈ అవార్డు పొందింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాదే ఈ అవార్డు తెలంగాణ ఆర్టీసీ పరమైంది. ఉత్తమ కేఎంపీఎల్‌ను మెరుగుపరుచుకునే కేటగిరీలో టీఎస్‌ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. కేఎంపీఎల్‌ను అంతకు ముందు సంవత్సరం 5.41 నుంచి 5.46కు పెంచుకుంది. ఈ రెండు అవార్డులను ఈ నెల 21న బెంగళూరులో జరిగే ఏఎస్‌ఆర్టీయూ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా సంస్థ జేఎండీ రమణారావు అవార్డును స్వీకరించనున్నారు. ‘ఇంధనాన్ని పొదుపు చేసే సదుద్దేశంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో కూడా టీఎస్‌ఆర్టీసీని ఉత్తమంగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం’ అని జేఎండీ రమణారావు పేర్కొన్నారు.