- గురుకుల నోటిఫికేషన్ వచ్చిందనే సంబరం కాసేపే
- నిబంధనలు చూసి బిత్తరపోతున్న నిరుద్యోగ, విద్యార్థిలోకం
- ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా లేదంటూ ఆవేదన
-
అర్హతల విషయంలో ఆమోదయోగ్యంకాని ఆంక్షలు
- తెలుగు ఆంగ్లమాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలి
- పీజీటీకి పెట్టిన మూడేళ్ల బోధనానుభవం నిబంధన తొలగించాలి
- 60%శాతంగా ఉన్న డిగ్రీ అర్హత ను మార్చాలి
- పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలి
- పురుష అభ్యర్థులకు కూడా వివక్ష లేకుండా అమ్మాయిలతోపాటు సమాన అవకాశాలు కల్పించాలి
- ప్రిపరేషన్ కు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం ఇవ్వాలి
- టెట్ ను అర్హత గా భావించి ప్రిలిమ్స్ ను రద్దుచేయాలి.
ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే సాధారణంగా ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి లోకం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారింది. ఇదేం నోటిఫికేషన్ దేవుడా అంటూ తాము తలలు పట్టుకునే పరిస్థితి ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలొస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన తమకు టీఎస్‌పీఎస్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో ఊహించని నిబంధనలు పెట్టి తమ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసిందని గగ్గోలు పెడుతున్నారు.
ఊరించి ఊరించి ఉసూరుమనిపించినట్లు తొలిసారి ఒక మోస్తరు నోటిఫికేషన్‌ను గురుకుల విద్యాలయాల్లో టీచర్ల కొలువుల పేరిట టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల సంఖ్య 7306. ఉద్యోగాల సంఖ్య సంగతి ఎట్లున్నా టీఎస్‌పీఎస్సీ పెట్టిన నిబంధనలు చూసి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అభ్యర్థులు చెబుతున్న ఆందోళనకరమైన విషయాలేమిటంటే..
గ్రామీణ సోయి మరిచారు
‘తెలంగాణ నగర తెలంగాణ కాదు.. గ్రామీణ తెలంగాణ. ఈ సోయి టీఎస్‌పీఎస్‌సీ పెద్దలు మరిచినట్లే కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మొన్నటి వరకు డిగ్రీ చేసే పరిస్థితులే అంతంతమాత్రం. అలాంటిది పాసవడం.. పైగా పెద్దపెద్ద పర్సెంటేజీలు తెచ్చుకోవడం ఇంకా కష్టం. సగం రోజులు కాలేజీల్లో.. సగం రోజులు కూలిపనుల్లో ఉంటూ చదివినవారు.. ఎట్లా పూర్తిగా చదువుతారు ఎట్లా మంచి పర్సెంటేజీ సాధ్యమైతది? ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్‌లో టీజీటీ, పీజీటీ పోస్టులకు డిగ్రీకి 60శాతం ఓసీ, బీసీ అభ్యర్థులకు, 55శాతం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హతగా పెట్టారు. బహుశా ఈ నిబంధన దేశవ్యాప్తంగా ఏ పరీక్షకు నిర్ణయించలేదనే విషయం టీఎస్‌పీఎస్‌సీ తెలుసుకుంటే మంచిది’ అంటూ అభ్యర్థులు వేడుకుంటున్నారు.
ఆంగ్ల మాధ్యమం
‘తెలంగాణలో టీచర్ కొలువుకు పోటీపడే వారిలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారు అధికం. తెలుగు మాధ్యమంగా చదివినవారే దాదాపు 80 నుంచి 90% మంది ఉన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రశ్నాపత్రం కేవలం ఆంగ్లంలోనే ఇస్తామని టీఎస్‌పీఎస్‌సీ చెప్పింది. ఇది ఎంతవరకు సమంజసం? ఒక తెలుగు రాష్ట్రంలో తెలుగును కాదని, ఆంగ్ల మాధ్యమంలో పేపర్ ఇవ్వడం ఎంతవరకు సబబు? అన్నింటికిమించి ఇక ఆంగ్లంపై పట్టుసరిగా లేనివాళ్లకు ఈ నిబంధన ఒక ఆశని పాతమేగా? ఆంగ్లాన్ని కాదనడం లేదు.. అదే సమయంలో తెలుగు మాధ్యమాల్లో కూడా ప్రశ్నలు ఇవ్వాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.
మూడేళ్ల బోధనానుభవం
‘అన్నింటికిమించి పీజీటీ ఉద్యోగాలకు మూడేళ్ల బోధనానుభవం ఉండాలని నిబంధన పెట్టారు. అసలు ఈ నిబంధన పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. డిగ్రీ అయ్యాక, బీఈడీ, టీపీటీ, పీజీ, పీహెచ్‌డీ ఇలా చదువుకుంటూ వెళతారు.. అలా వెళ్లడం కుదరని వారు కాంపిటేషన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు. అంతేకానీ, ప్రైవేటు రంగంలో బోధనవైపు వెళ్లడం అరుదు? ఒక వేళ అలాంటి నిబంధన పెట్టే ఉద్దేశమే ఉంటే టీచర్ ఉద్యోగం చేయాలనుకునే వారు తమ బీఈడీ అయ్యాక మూడేళ్లు ఏదైనా పాఠశాలల్లో పనిచేయాలనే నిబంధన ముందే చెప్పి ఉండాలి.
వారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేవారికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. వారికి మాత్రమే అర్హత వస్తుంది. అంతేకాకుండా కొంత డబ్బుగలవారు తాము ఆయా పాఠశాలల్లో బోధన చేశామని దొంగ సర్టిఫికెట్లు తెచ్చే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన మిగితా వారంతా నష్టపోవాల్సిందేనా? దీని ప్రకారం 2013, 2014, 2015, 2016లో పీజీలు అయిపోయిన వారు పీజీటీ ఉద్యోగాలకు అనర్హులా? ’ అంటూ వారంతా నిలదీస్తున్నారు.
ఆన్‌లైన్ తలనొప్పి
‘ఇప్పటివరకు ఏ టీచర్ ఉద్యోగాన్ని కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించలేదు. అలాంటిది తొలిసారి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు పరిచయం లేకుండానే అందరికీ ఆన్‌లైన్‌లో పరీక్ష రాయడం ఎలా వస్తుంది? దీనిని టీఎస్‌పీఎస్‌సీ సభ్యులు ఏమేరకు సమర్థిస్తారు’ అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
బాలికల పాఠశాలల్లో అమ్మాయిలకే
’గురుకులాల్లో మొత్తం టీజీటీ పోస్టులు 4362. ఇందులో అమ్మాయిలకు 3238. మిగిలిన 1124 పోస్టుల్లో అదనంగా 33శాతం రిజర్వేషన్. దీంతో టీజీటీలో పురుష అభ్యర్థులకు మిగిలేది దాదాపు 753 పోస్టులు. అలాగే, పీజీటీలో చూస్తే మొత్తం 921 పోస్టులు అందులో అమ్మాయిలకు 732. మిగిలినవి 189 పోస్టులు. ఇందులో కూడా వారికి 33శాతం రిజర్వేషన్ పేరిట 62 పోస్టులు మళ్లీ అమ్మాయిలకు తీస్తే అబ్బాయిలకు మిగిలేది 127 పోస్టులు. అసలు అమ్మాయిల గురుకులాల్లో అమ్మాయిలే చెప్పాలి.. అబ్బాయిలు చెప్పకూడదు అనేది వివక్షను టీఎస్‌పీఎస్‌సీ స్వయంగా తెరపైకి తెచ్చినట్లు ఎందుకు భావించకూడదు?’ అని పురుష అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు.. ‘బీకాం, టీచర్ ట్రైనింగ్ చేసి, టెట్ అర్హత సాధించిన వారి పరిస్థితి ఏంటి? ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన వారికి టోటల్ మార్కులకు కలిపి ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్‌గా పరిగణిస్తున్నారు. అదే రెగ్యులర్‌గా డిగ్రీ చేసిన వారికి ఆప్షనల్స్ ప్రాతిపదికన తీసుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ గా పరిగణిస్తున్నారు. పరిస్థితులు అనుకూలించక ఓపెన్ వర్సిటీల్లో చదువుకున్న వారికి ఈ నిర్ణయం ఆశని పాతమే కదా? అంతేకాకుండా అదేదో కక్ష సాధింపుచర్యలాగా కనీసం నోటిఫికేషన్‌కు పరీక్ష సమయానికి కనీసం 45 రోజులు గడువు ఇవ్వాల్సింది పోయి కేవలం 39 రోజులు మాత్రమే ఇచ్చారు.
అలాగే, మెయిన్స్ పరీక్షకు ప్రిలిమ్స్ మధ్య కూడా 39 రోజుల నిడివి మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా చేయగలరు? ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ నోటిఫికేషన్‌లో టీఎస్‌పీఎస్‌సీ చేసిన పొరపాట్లు నిర్లక్ష్యాలు కోకొల్లలు. ఒక ఉద్యోగ నోటిఫికేషన్‌పై ఇన్ని అనుమానాలు, ఇంత స్థాయి వివాదాలు బహుశా కేంద్రం నిర్వహించే సివిల్ సర్వీస పరీక్షకు కూడా రాలేదంటే ఆశ్చర్యం కాదేమో’ అంటూ ఇలా ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతివాహన, పాలమూరు, తెలంగాణ తదితర విశ్వవిద్యాలయాలకు చెందిన నిరుద్యోగ విద్యార్థిలోకం, పట్టణ ప్రాంత, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగ, విద్యార్థిలోకం చేస్తున్న ప్రధాన డిమాండ్లు