సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవవన్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీ ఎండిగా వ్యవహరిస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. కార్మికుల డిమాండ్లను ఈ కమిటీ పరిశీలించి ఆర్టీసీ ఎండీకి నివేదిక అందిస్తుంది.
ఈ.డి టి.వెంకటేశ్వర్ రావు అధ్యక్షుడిగా ఈడిలు.. ఎ. పురుషోత్తం, సి. వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్ సభ్యులుగా కమిటీ ఏర్పటైంది. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందిస్తుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ సుల్తానియా, ఈడిలు సమీక్షలో పాల్గొన్నారు.
‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారు. అదే తమ ప్రథమ అవసరం అని కూడా చెప్పారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్టబోమని చెప్పారు. కార్మిక సంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనే డిమాండ్ నెరవేరితే తప్ప చర్చలకు రామని కార్మికులు ఎప్పుడూ చెప్పలేదన్నారు.
విలీన డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని వారి న్యాయవాది చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ డిమాండ్లు పరిశీలించాలి. దానికోసం అధ్యయనం చేయండి’’ అని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment