కమిటీ అక్కర్లేదన్న తెలంగాణ సర్కార్‌ | TSRTC Strike : State Government Says No To High Court Proposal | Sakshi
Sakshi News home page

కమిటీ అక్కర్లేదన్న తెలంగాణ సర్కార్‌

Published Thu, Nov 14 2019 2:12 AM | Last Updated on Thu, Nov 14 2019 8:47 AM

TSRTC Strike : State Government Says No To High Court Proposal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మె వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అలాంటి కమిటీ ఏదీ అవసరం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రతిపాదించిన విధంగా తాము ఎటువంటి కమిటీని ఏర్పాటు చేయబోమని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె వివాదాన్ని పారిశ్రామిక వివాదాల చట్టం కింద లేబర్‌ కోర్టుకు నివేదించాల్సి ఉందని తెలిపింది. వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని పారిశ్రామిక వివాదాల చట్టంలో ఎక్కడా లేదని నివేదించింది. అందువల్ల పారిశ్రామిక వివాదాల చట్టం కింద ఈ వ్యవహారంలో తాము ముందుకెళ్లే విధంగా ఎటువంటి జాప్యానికి తావు లేకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎస్‌కే జోషి బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేశారు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఎస్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ను అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనం ముందుంచారు. హైకోర్టు చెప్పిన విధంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయడానికి తాము సుముఖంగా లేమని, చట్టంలో అలా కమిటీ వేయాలన్న నిబంధన లేకపోవడమే అందుకు కారణమని ఆయన చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరు జోక్యం చేసుకుంటూ.. కమిటీ ఏర్పాటు చేసే అధికారం హైకోర్టుకు ఉందని, ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా ఉన్నాయని.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం మాత్రమే అంగీకరించడంలేదని తెలిపారు. తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారని కోర్టుకు నివేదించారు. కార్మికుల విషయంలో ప్రభుత్వం చాలా మొండి వైఖరిని అవలంబిస్తోందని, ఆర్టీసీ ఎండీని నియమించాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, మీరు అలా అర్థం చేసుకుంటే తాము చేయగలిగింది ఏమీ లేదని, 21 డిమాండ్లు పరిష్కరించతగ్గవని మాత్రమే చెప్పామని వ్యాఖ్యానించింది.

ఆ జీవో కాల పరిమితి ఆరు నెలలే...
ఏజీ తన వాదనలను కొనసాగిస్తూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని, ఎస్మా కింద వారిపై చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఎస్మా కింద కార్మికులపై ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. ఆర్టీసీని అత్యవసర సేవల నిర్వహణ కింద తీసుకొస్తూ ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చాని అడిగింది. సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అన్నది లేబర్‌ కోర్టు తేలుస్తుందని స్పష్టం చేసింది. అలాంటప్పుడు ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధీకృత అధికారి ఎవరని ప్రశ్నించింది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ చేయవచ్చునని ఏజీ చెప్పగా.. ధర్మాసనం విబేధించింది. ఆర్టీసీని ఎస్మా కిందకు తీసుకొస్తూ 2015లోనే జీవో జారీ చేశామని ఏజీ వెల్లడించగా, ఆ జీవో కాల పరిమితి ఆరు నెలలే ఉంటుందని గుర్తుచేసింది. అంతేకాక ఆ జీవో ఏపీఎస్‌ ఆర్టీసీకే పరిమితమని తెలిపింది. అయితే, టీఎస్‌ ఆర్టీసీ.. ఏపీఎస్‌ ఆర్టీసీలో భాగమని ఏజీ వెల్లడించారు. రవాణా చట్టంలో సెక్షన్‌ 47 తమకు వర్తించదని, ఆ చట్టం కింద ఆర్టీసీ విభజనకు తాము కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. ఆర్టీసీలో 33 శాతం వాటా కేంద్రానికి ఉందని, అలాగే ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అందులో భాగమని, ఇదే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది. రవాణా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదని, పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 9 ప్రకారం ఆర్టీసీ ఆస్తి, అప్పుల విభజన జరగాల్సి ఉందని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వివరించారు. ఆర్టీసీ విభజన విషయంలో కేంద్రానిది నామమాత్రపు పాత్రేనన్నారు. ఆర్టీసీ చట్టం, పునర్విభజన చట్టాలను పోలిస్తే, పునర్విభజన చట్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.

విచారణను ముగించండి...
హైకోర్టులో దాఖలైన ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరుగుతున్నందున సమ్మెపై లేబర్‌ కోర్టుకు వెళ్లే విషయంలో జాప్యం జరుగుతోందని ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని, అయితే కార్మిక సంఘాలు మాత్రమే ఆ కమిటీ విషయంలో తగిన విధంగా స్పందించలేదని చెప్పారు. ఈ వ్యవహారంలో విచారణను ఇంతటితో ముగించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ వివాదాన్ని లేబర్‌ కమిషనర్‌కు నివేదిస్తే, కమిషనర్‌ దానిని లేబర్‌ కోర్టుకు పంపడం, అక్కడ విచారణ జరిపి ఈ వివాదం తేలేందుకు జాప్యం జరగదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషనర్‌ ముందు రెండు మార్గాలున్నాయని, వివాదాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించడం ఒకటైతే, నివేదించకుండా అందుకు కారణాలు చెప్పడం రెండోదని తెలిపింది. ఇందుకు ఏజీ స్పందిస్తూ, లేబర్‌ కమిషనర్‌ వెంటనే లేబర్‌ కోర్టుకు ఈ వివాదాన్ని నివేదిస్తారని, ఇందుకు నాలుగు వారాల గడువు కావాలని, వీలైనంత త్వరగా వివాదానికి ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమాధానమిచ్చారు.

సమ్మె చట్ట విరుద్ధమే...
ఆర్టీసీ యాజమాన్యం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, సమ్మె చట్ట విరుద్ధమని స్పష్టంచేశారు. అలా ఎలా చెబుతారని, లేబర్‌ కోర్టు ఆ విషయం చెప్పాలని ధర్మాసనం గుర్తు చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని పారిశ్రామిక వివాదాల చట్టంలోనే ఉందని రామచంద్రరావు పేర్కొన్నారు. వివాదం తలెత్తినప్పుడు వివాద పరిష్కారం పారిశ్రామిక వివాదాల చట్ట పరిధిలోనే జరగాలన్నారు. ఈ సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫు సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి.. ఈ కేసులో తదుపరి వాదనలు వినిపించేందుకు వీలుగా విచారణను ఈ నెల 18కి వాయిదా వేయాలని కోరారు. ఈ లోపు తాను అందుబాటులో ఉండనని, అందుకే 18కి వాయిదా కోరుతున్నానని చెప్పారు. ప్రకాశ్‌రెడ్డి అభ్యర్థనను మన్నించిన ధర్మాసనం తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది. ఇదే సమయంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం మరోసారి పొడిగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement