సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ‍్ల సాధన కోసం 57వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2వేల స్పెషల్ బస్సులతో పాటు 10,395 బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు బస్సులు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. అయితే తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా జూబ్లీ బస్టాండ్‌లోకి ఓ బస్సు రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రయాణికులు... బస్సు ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచే బస్సు కోసం వేచి చూస్తున్నామని, వచ్చిన ఒక్క బస్సులో అయినా కాస్త జాగా దొరికితే చాలునుకుంటూ లగేజీ పట్టుకుని పరుగులు పెట్టారు.
అలాగే హైదరాబాద్‌లో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. సెట్విన్ బస్సులు మాత్రం యథాతథంగా నడుస్తున్నాయి. మరోవైపు జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దసరా పండుగక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లలో పడిగాపులు పడుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లుగా ప్రయివేట్ వాహనదారులు, ఆటోవాలాలు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అధిక మొత్తం చెల్లించి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. పలు జిల్లాల్లో పోలీసుల భద్రత నడుమ ఆర్టీసీ బస్సులను... కాంట్రాక్ట్ సిబ్బందితో నడిపిస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు ...అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఏపీ, కర్ణాటక నుంచి బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.
చదవండి: ఆర్టీసీ సమ్మె: మా టికెట్ రిజర్వేషన్ల సంగతేంటి?
Comments
Please login to add a commentAdd a comment