విచారణకు రవిప్రకాశ్, శివాజీ డుమ్మా | TV9 Ravi Prakash Shivaji Absent To Police Enquiry | Sakshi
Sakshi News home page

విచారణకు రవిప్రకాశ్, శివాజీ డుమ్మా

Published Sat, May 11 2019 1:17 AM | Last Updated on Sat, May 11 2019 4:26 AM

TV9 Ravi Prakash Shivaji Absent To Police Enquiry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ పోలీసు విచారణకు హాజరుకాలేదు. శుక్రవారం విచారణకు రావాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వారిద్దరితోపాటు టీవీ 9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎంకేవీఎన్‌ మూర్తికి నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. రవిప్రకాశ్, శివాజీ విచారణకు డుమ్మా కొట్టగా.. మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో గచ్చిబౌలిలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. క్రైమ్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం ఆయన్ను రాత్రి వరకు విచారించింది. కాగా, రవిప్రకాశ్‌ వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు తెలిసింది. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బంజారాహిల్స్‌లోని టీవీ 9 కార్యాలయంలో కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రశ్నించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవిప్రకాశ్‌ ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో దేవేంద్ర అగర్వాల్‌ను విచారించారు.

టీవీ 9 కార్యాలయం వద్ద హైడ్రామా...
టీవీ 9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం 8 గంటలకు సీఈవో హోదాలో రవిప్రకాశ్‌ కార్యాలయానికి వచ్చారు. ఆయన లోనికి వెళుతున్నప్పుడు టీవీ చానళ్ల ప్రతినిధులు కెమెరాల్లో రికార్డు చేయడానికి ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. తాము రోడ్డు మీద నిలబడి రికార్డు చేస్తున్నామని సాక్షి టీవీ ప్రతినిధులు చెప్పినప్పటికీ, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి వీల్లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, రవిప్రకాశ్‌ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన చాంబర్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టీవీ 9 కార్యాలయానికి రావడంతో రవిప్రకాశ్‌ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అసోసియేట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏబీసీపీఎల్‌) బోర్డు సభ్యులు అక్కడకు చేరుకుని సమావేశమయ్యారు. అనంతరం అక్కడున్న సెక్యూరిటీని తొలగించి, కొత్తవారిని నియమించారు. రవిప్రకాశ్‌ మళ్లీ కార్యాలయానికి వస్తే లోనికి అనుమతించొద్దని కొత్త సెక్యూరిటీకి ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో తాను సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా రవిప్రకాశ్‌ ఓ సహచరుడి ద్వారా లేఖ పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement