కృష్ణమ్మ.. పరవళ్లు
నాగార్జునసాగర్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెల్లని పాలనురగలతో 12 క్రస్ట్‌గేట్ల మీదుగా దిగువకు దుముకుతోంది. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో ఏ ఆర్భాటమూ లేకుండా ప్రాజెక్టు ఎస్‌ఈ విజయభాస్కర్‌రావు సోమవారం ఉదయం ఆరు గంటలకు పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి గేట్ల స్విచ్ ఆన్ చేశారు. 10వ గేటు నుంచి 17వ గేటు వరకు మొత్తం 8 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ఉన్న శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టంతో కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయానికి నీరు అనూహ్యంగా పెరుగుతుండడంతో మూడు రేడియల్ క్రస్ట్‌గేట్లు 10అడుగుల మేర ఎత్తి సాగర్ జలాశయానికి నీటిని వదిలారు. దీంతో సాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతుండడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు మరో నాలుగు క్రస్ట్‌గేట్లను (8,9, 18, 19 గేట్లు) ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మొత్తంగా 12 గేట్ల మీదుగా కృష్ణమ్మ దిగువకు పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి సాయంత్రం 1,60,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సాగర్‌నుంచి 12గేట్ల ద్వారా 97,200 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, ఏఎమ్మార్పీ, వరద, విద్యుదుత్పాదన ద్వారా 57,124 క్యూసెక్కులు మొత్తంగా 1,54,124 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఎగువనుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి విడుదల చేస్తున్నారు.
సాగర్‌లో పర్యాటకుల సందడి
సాగర్ క్రస్ట్‌గేట్లు ఎత్తారని ప్రచారసాధనాల ద్వారా తెలుసుకున్న పర్యాటకులు సాగర్ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పర్యాటకులు సాగర్ సందర్శనకు తరలివచ్చారు. కృష్ణాతీరం వెంట ఇరువైపులా నిలబడి కృష్ణమ్మ పరవళ్లను తిలకించారు.
వరద నీటి రాకను అంచనా వేయలేకపోతున్న అధికారులు
వరద నీటి రాకను సాగునీటిశాఖ అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయానికి వచ్చే వరదనీరు లక్ష క్యూసెక్కులలోపే ఉంటుంది. లక్షకు పైచిలుకు నీటిని దిగువకు వదులుతున్నా.. జలాశయం నీటిమట్టం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఉదయం 68,905 క్యూసెక్కుల నీరు వస్తుండగా కేవలం రెండుగేట్లు మాత్రమే ఎత్తించారు. అయినా నీటిమట్టం పెరుగుతుండడంతో మరోగేటు ఎత్తారు. రాత్రి 92,266వేల క్యూసెక్కులు వస్తోంది. అర్ధరాత్రి తర్వాత మరో గేటు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గేటు ఎత్తితే సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతుంది కాబట్టి మంగళవారం మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం అధికారులు తెలిపారు.
ఉప నదులతోనే వరద
కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు అప్పటికప్పుడే వరదలు వచ్చి వెంటనే నిలిచిపోతున్నాయి. ఎగువ కృష్ణానది నుంచి వచ్చే వరదలైతే నదిలో ఉన్న నీటిని కూడా అంచనా వేసి ఎంత వస్తుందో చెప్పగలుగుతారని, ఈ వరద నీటిని లెక్కిండం కష్టమని రిటైర్ ఇంజినీర్లు ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నాగార్జునసాగర్ గేట్ల ఎత్తివేత ఎంతకాలం.. ఎంతసేపు కొనసాగుతుందో కూడా డ్యాం అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు.