Radial gates crust
-
సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద 26 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ దిగువకు పరవళ్లు తొక్కుతోంది. కృష్ణానది పరీవాహక ప్రాంతానికి ఎగువన గల జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. అదనంగా వచ్చే నీటినంతటినీ ఆయా జలాశయాల నుంచి రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 10 రేడియల్ క్రస్ట్‌గేట్లను 12 అడుగులు ఎత్తి 3,17,460 క్యూసెక్కుల నీటిని, కుడి, ఎడమగట్టు విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 62,382 క్యూసెక్కులు ఇలా మొత్తం 3,79,842 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 3,13,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రాజెక్టు 26 రేడియల్ క్రస్ట్ గేట్లకుగాను 16 గేట్లు 5 అడుగులు, 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,60,316 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే మీదుగా కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదన ద్వారా 33,251 క్యూసెక్కులు మొత్తం కృష్ణానదిలోకి 2,93,567 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం 584.90 అడుగులు(297.1465 టీఎంసీలు). గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు(312.0450 టీఎంసీలు). జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో ధరూరు/దోమలపెంట: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఆదివారం ప్రాజెక్టుకు 2.77 లక్షల క్యూసెక్కుల వరద రాగా, 38 క్రస్టు గేట్లు ఎత్తి 2,57,754 క్యూసెక్కులు శ్రీశైలానికి వదిలారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహంకొనసాగుతోంది. ఈ క్రమంలో ఎగువనున్న ఆయా ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 3,78,483 క్యూసెక్కుల వరద రావడంతో ఆనకట్ట వద్ద పదిగేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ 3,79,842 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
-
పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తి
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం అవిష్కృతమయ్యింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తి అయ్యాయి. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. గత సీజన్లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకుగానూ 84 సిలిండర్లను అమర్చారు. త్వరలోనే మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. -
రేడియల్ గేట్ల ద్వారా గోదావరి జలాలు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ రేడియల్ గేట్ల ద్వారా గోదావరి జలాలు తొలిసారిగా దిగువకు చేరుతున్నాయి. స్పిల్‌వే క్లస్టర్ ఎత్తు 25.72 మీటర్లు కాగా.. నీటిమట్టం అంతకుమించి పెరగడంతో 10 రేడియల్ గేట్ల నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ ఏడాది ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పనులు పూర్తిచేసి స్పిల్‌వే మీదుగా గోదావరి వరద నీటిని మళ్లించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో కాఫర్‌డ్యామ్ ఎగువ భాగాన నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షం నీరు నదిలో కలుస్తుండటంతో స్పిల్‌వే క్లస్టర్ వద్ద నీటిమట్టం శుక్రవారం నాటికి 26.2 మీటర్ల ఎత్తుకు పెరిగింది. క్లస్టర్ లెవెల్ దాటడంతో రేడియల్ గేట్ల ద్వారా నీరు స్పిల్ చానల్లోకి చేరుతోంది. అక్కడి నుంచి పైలట్ చానల్ వద్ద మహానందీశ్వర స్వామి ఆలయం దిగువన గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తోంది. -
కృష్ణమ్మ.. పరవళ్లు
నాగార్జునసాగర్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెల్లని పాలనురగలతో 12 క్రస్ట్‌గేట్ల మీదుగా దిగువకు దుముకుతోంది. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో ఏ ఆర్భాటమూ లేకుండా ప్రాజెక్టు ఎస్ఈ విజయభాస్కర్‌రావు సోమవారం ఉదయం ఆరు గంటలకు పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి గేట్ల స్విచ్ ఆన్ చేశారు. 10వ గేటు నుంచి 17వ గేటు వరకు మొత్తం 8 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ఉన్న శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టంతో కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి నీరు అనూహ్యంగా పెరుగుతుండడంతో మూడు రేడియల్ క్రస్ట్‌గేట్లు 10అడుగుల మేర ఎత్తి సాగర్ జలాశయానికి నీటిని వదిలారు. దీంతో సాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతుండడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు మరో నాలుగు క్రస్ట్‌గేట్లను (8,9, 18, 19 గేట్లు) ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మొత్తంగా 12 గేట్ల మీదుగా కృష్ణమ్మ దిగువకు పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి సాయంత్రం 1,60,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సాగర్‌నుంచి 12గేట్ల ద్వారా 97,200 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, ఏఎమ్మార్పీ, వరద, విద్యుదుత్పాదన ద్వారా 57,124 క్యూసెక్కులు మొత్తంగా 1,54,124 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఎగువనుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి విడుదల చేస్తున్నారు. సాగర్‌లో పర్యాటకుల సందడి సాగర్ క్రస్ట్‌గేట్లు ఎత్తారని ప్రచారసాధనాల ద్వారా తెలుసుకున్న పర్యాటకులు సాగర్ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పర్యాటకులు సాగర్ సందర్శనకు తరలివచ్చారు. కృష్ణాతీరం వెంట ఇరువైపులా నిలబడి కృష్ణమ్మ పరవళ్లను తిలకించారు. వరద నీటి రాకను అంచనా వేయలేకపోతున్న అధికారులు వరద నీటి రాకను సాగునీటిశాఖ అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయానికి వచ్చే వరదనీరు లక్ష క్యూసెక్కులలోపే ఉంటుంది. లక్షకు పైచిలుకు నీటిని దిగువకు వదులుతున్నా.. జలాశయం నీటిమట్టం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఉదయం 68,905 క్యూసెక్కుల నీరు వస్తుండగా కేవలం రెండుగేట్లు మాత్రమే ఎత్తించారు. అయినా నీటిమట్టం పెరుగుతుండడంతో మరోగేటు ఎత్తారు. రాత్రి 92,266వేల క్యూసెక్కులు వస్తోంది. అర్ధరాత్రి తర్వాత మరో గేటు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గేటు ఎత్తితే సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతుంది కాబట్టి మంగళవారం మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం అధికారులు తెలిపారు. ఉప నదులతోనే వరద కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు అప్పటికప్పుడే వరదలు వచ్చి వెంటనే నిలిచిపోతున్నాయి. ఎగువ కృష్ణానది నుంచి వచ్చే వరదలైతే నదిలో ఉన్న నీటిని కూడా అంచనా వేసి ఎంత వస్తుందో చెప్పగలుగుతారని, ఈ వరద నీటిని లెక్కిండం కష్టమని రిటైర్ ఇంజినీర్లు ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నాగార్జునసాగర్ గేట్ల ఎత్తివేత ఎంతకాలం.. ఎంతసేపు కొనసాగుతుందో కూడా డ్యాం అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు.