అదుపులోకి తీసుకున్న నిందితులు
మహబూబ్‌నగర్ క్రైం: సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.. కొంత నగదు జమ చేసి.. మీరు కొంత మందిని చేర్పిస్తే మీ ఖాతాలో ప్రతినెలా కమీషన్ వేస్తామని నమ్మబలికారు.. ఇలా సామాన్యుల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారు.. ఈ ఘటనపై పది రోజుల క్రితం జిల్లాకేంద్రంలోని మర్లుకు చెందిన మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఇందులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అనురాధ వెల్లడించారు.
హైదరాబాద్ టు దుబాయ్..
హైదరాబాద్‌లోని కొత్తపేట్ పనిగిరికాలనీకి చెందిన మాలావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి దుబాయ్‌కి చెందిన అనూప్ థామస్‌తో ఆన్‌లైన్ ద్వారా పరిచయం చేసుకున్నారు. సీసీటీసీ గ్లోబల్ డాట్‌కాం ద్వారా రూ.12 వేలు డిపాజిట్ చేసి ఒక ఐడి తీసుకుంటే రోజుకు రూ.0.60 కమీషన్ వస్తుందని, ఎన్ని ఐడీలు తయారు చేస్తే అన్ని డాలర్ల కమీషన్ చెల్లిస్తామ నమ్మబలికారు. మాలావత్ లక్ష్మణ్ ఆ వెబ్‌సైట్‌ను తయారు చేసి దాదాపు 200 మందికి మాయమాటలు చెప్పి అతని ఖాతాతోపాటు భార్య, ఇతర బంధువుల ఖాతాలో రూ.కోట్లలో నగదును జమ చేయించారు.
ఇందులో భాగంగానే మాలావత్ లక్ష్మణ్ గతేడాది సెప్టెంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వారా మహబూబ్‌నగర్‌కు వ చ్చాడు. ఆ తర్వాత జిల్లాకేంద్రం లోని అయోధ్యనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయప్రతాప్‌రెడ్డితో పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత మాలావత్ లక్ష్మణ్ ఏర్పాటు చేసిన సీసీటీసీ గ్లోబల్ డాట్‌కాం గురించి వివరించి దీని ద్వారా సులభంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందని చెప్పడంతో విజయప్రతాప్‌రెడ్డితోపాటు భీమయ్య, బాలకృష్ణ, గిరి కలిసి సామాన్య అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి పట్టణానికి చెందిన 47 మందిని ఆ వెబ్‌సైట్‌లో చేర్పించారు. ఇందులో ఒక్కొక్కరు రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేశారు.
అలాగే ఒక మహిళ రూ.7.50 లక్షలు జమ చేసింది. దీంట్లో ఒక్కరికి కూడా 10 శాతం నగదు తిరిగి ఇవ్వలేదు. అయితే గత మూడు నెలలుగా ఖాతాలో నగదు పడకపోవడంతో మర్లుకు చెందిన మణెమ్మ విజయప్రతాపరెడ్డిని సంప్రదించగా తనకేం తెలియదని, వెబ్‌సైట్ తయారు చేసిన వ్యక్తి దగ్గర మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో మణెమ్మ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేపట్టగా వివరాలు బయటికి వచ్చాయని ఎస్పీ పేర్కొన్నారు.
కేసులు నమోదు..
మాలావత్ లక్ష్మణ్ నుంచి రూ.1,79,100, విజయప్రతాప్‌రెడ్డి నుంచి రూ.5 లక్షల నగదు సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. అలాగే మాలావత్ లక్ష్మణ్‌తోపాటు అతని భార్య, ఇతర కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, విజయప్రతాప్‌రెడ్డి ఖాతాలో ఉన్న రూ.47.41 లక్షలను ఫ్రీజ్ చేశామన్నారు. ఈ కేసులో ఏ1గా మాలావత్ లక్ష్మణ్, అతని అత్త మంగమ్మ, మరదలు కవిత, భార్య సరిత, స్నేహితుడు అఖిల్, ఏ2గా విజయప్రతాప్‌రెడ్డి, ఏ3గా భీమయ్య, ఏ4గా బాలకృష్ణ, ఏ5గా గిరిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
మాలావత్ లక్ష్మణ్, విజయ ప్రతాప్‌రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ తరలించామని, మిగతా వ్యక్తులు పరారీలో ఉన్నారని వాళ్లను కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. ఇంట్లో కూర్చోని సులువుగా డబ్బులు సంపాదించవచ్చని మల్టీలెవల్ మార్కెటింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు పెడితే మోసం పోతారన్నారు. ఇలా డబ్బులు జమ చేస్తే కమీషన్ వస్తోందని చెప్పే వ్యక్తులను ఏమాత్రం నమ్మరాదని డబ్బులు తీసుకుని తర్వాత ఖాతాలను ఎత్తివేసి చీటింగ్ చేస్తారని హెచ్చరించారు. దీంట్లో బాధితులు కట్టిన డబ్బులో కనీసం 10 శాతం కూడా తిరిగి రాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వ ర్లు, డీఎస్పీ భాస్కర్, రూరల్ సీఐ కిషన్, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment