
బోధన్ స్కాంలో మరో ఇద్దరు సీటీవోల అరెస్ట్
- సీఐడీ అదుపులో సంజయ్‌గౌడ్, పూర్ణచందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బోధన్ స్కాం వ్యవహారంతో వాణిజ్య పన్నుల శాఖలో తీవ్ర కలవరం మొదలైంది. వరుసగా సీఐడీ చేస్తున్న అరెస్టులు ఆరోపణలెదుర్కుంటున్న అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస్‌రావుతో పాటు రిటైర్డ్ సీటీవో కృష్ణమాచారిని సీఐడీ ఆదివారం ఉదయం అరెస్ట్ చేసింది. ఈ వార్త వెలుగులోకి రాకముందే మరో ఇద్దరు సీటీవోలను నిజామాబాద్‌లో సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ వరుస పరిణామాలు కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
ధరణి శ్రీనివాస్‌రావు, కృష్ణమాచారికి రిమాండ్...
బోధన్‌లో పనిచేసిన ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సంజయ్‌గౌడ్, పూర్ణచందర్‌రెడ్డిలను సీఐడీ చాకచక్యంగా సోమవారం అదుపులోకి తీసుకుంది. దాడులు చేసేందుకు వస్తున్నారని ముందే పసిగట్టిన సీటీవోలు... ఇళ్లకు తాళాలు వేసి పరారయ్యారు. ఎట్టకేలకు వారిని గుర్తించి నిజామాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. వీరితోపాటు ఆదివారం అరెస్ట్ చేసిన డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస్‌రావు, రిటైర్డ్ సీటీవో కృష్ణమాచారిని నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామని, వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తామన్నారు.
వణికిపోతున్న మహిళ అధికారులు...
రూ. 350 కోట్లకు పైగా జరిగిన కుంభకోణంలో తాజాగా ముగ్గురు మహిళా అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఓ ఉన్నతాధికారి శివరాజు అండ్ గ్యాంగ్ నుంచి నెలకు రూ.10 లక్షలు కమిషన్ పద్ధతిన తీసుకున్నట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. మరో ఇద్దరిలో ఒక డీసీటీవో, ఒక సీటీవో మహిళా అధికారి ఉన్నారని, వీరి అరెస్టుకు సంబంధించి ఇప్పటికే సీఎంఓ నుంచి సీఐడీకి అనుమతి వచ్చినట్టు తెలిసింది.