చిన్న వయసులో పెద్ద కష్టం
తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు
తల్లిదండ్రుల ఆలనాపాలనలో పెరగాల్సిన ఆ చిన్నారులు అనాథలయ్యారు. అందరిలా ఆడిపాడాల్సిన వయస్సులో అమ్మానాన్నను కోల్పోయి ఒంటరిగా మిగిలారు. నాలుగేళ్ల క్రితం తండ్రి, రెండు రోజుల క్రితం తల్లి మరణించడంతో వారు దిక్కులేని వారయ్యారు. నా అనేవారు లేని ఆ పసివాళ్ల దీనగాథ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.
మొల్కపట్నం (వేములపల్లి) : మండలంలోని మొల్కపట్నం గ్రామానికి చెందిన బొమ్మగాని సైదులు, సైదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్దకుమార్తె శిరీష రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి, చిన్నకుమార్తె శ్రావణి మొల్కపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితం పిల్లల తండ్రి సైదులు అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుంచి తల్లి సైదమ్మ కూలినాలికెళ్తూ పిల్లల బరువు బాధ్యతలను చూసుకుంటూ వారిని చదివిస్తోంది.
ఏం జరిగిందంటే...
సైదమ్మ రోజు మాదిరిగానే మంగళవారం కూలీ పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన అనంతరం రాత్రి ఇద్దరు పిల్లతో కలిసి భోజనం చేసింది. అనంతరం నిద్రకు ఉపక్రమించారు. పాఠశాలకు సమయం కావడంతో పిల్లలు తల్లిని లేపగా ఉలుపలుకు లేదు. ఆందోళనకు గురైన పిల్లలు వెంటనే బయటకు పరిగెత్తి కన్నీతి పర్యంతమవుతుండగా చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. అప్పటికే సైదమ్మ మృతి చెందింది. తల్లి మృతదేహం వద్ద చిన్నారులు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అసలే పేదరికం.. ఆపై పసిప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన శిరీష, శ్రావణిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.