కట్టంగూర్ (నకిరేకల్) : మండలంలోని అయిటిపాముల గ్రామ శివారులో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిటిపాముల గ్రామ సమీపంలోని ఎన్‌టీఆర్ స్టేజీ సమీపంలో ఇసుక లారీని ప్రవేట్ బస్సు ఓవర్‌టేక్ చేస్తూ కొద్దిగా ఢీకొట్టింది. దీంతో రెండు డ్రైవర్‌లు నిర్లక్ష్యంగా రోడ్డు పై లారీని, బస్సును నిలిపి వాగ్వాదానికి దిగారు.
అదే సమయంలో సూర్యాపేట పరిసర ప్రాంతాలను నుంచి స్నేహ చికెన్‌కు చెందిన కోళ్ల వ్యాను హైదరాబాదుకు వెళుతూ ఆగిఉన్న ఇసుక లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలోని ముగ్గురు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన వారిరి బయటి తీశారు. ఈ ప్రమాదంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడేనికి చెందిన శివకుమార్(23), హైదరాబాదులోని అంబర్‌పేటకు చెందిన వెంకటేశం (27)లను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు.
డ్రైవర్ శోభన్‌బాబు పరిస్థితి విషమించటంతో హైదరబాదుకు చికిత్స నిమిత్తం తరలించారు. వాహనాలు ఢీకొని రోడ్డుకు అడ్డంగా తిరగటంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. పోలీసులు సమీపంలో డీవైడర్ నుంచి మళ్లించి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రంజిత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment