kattanguru
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
కట్టంగూర్ (నకిరేకల్) : మండలంలోని అయిటిపాముల గ్రామ శివారులో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిటిపాముల గ్రామ సమీపంలోని ఎన్టీఆర్ స్టేజీ సమీపంలో ఇసుక లారీని ప్రవేట్ బస్సు ఓవర్టేక్ చేస్తూ కొద్దిగా ఢీకొట్టింది. దీంతో రెండు డ్రైవర్లు నిర్లక్ష్యంగా రోడ్డు పై లారీని, బస్సును నిలిపి వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో సూర్యాపేట పరిసర ప్రాంతాలను నుంచి స్నేహ చికెన్‌కు చెందిన కోళ్ల వ్యాను హైదరాబాదుకు వెళుతూ ఆగిఉన్న ఇసుక లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలోని ముగ్గురు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో క్యాబిన్లో ఇరుక్కుపోయిన వారిరి బయటి తీశారు. ఈ ప్రమాదంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడేనికి చెందిన శివకుమార్(23), హైదరాబాదులోని అంబర్‌పేటకు చెందిన వెంకటేశం (27)లను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. డ్రైవర్ శోభన్‌బాబు పరిస్థితి విషమించటంతో హైదరబాదుకు చికిత్స నిమిత్తం తరలించారు. వాహనాలు ఢీకొని రోడ్డుకు అడ్డంగా తిరగటంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. పోలీసులు సమీపంలో డీవైడర్ నుంచి మళ్లించి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రంజిత్ పేర్కొన్నారు. -
ముంపుప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
కట్టంగూర్ మండల కేంద్రంలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టులను, కాలువలను, డ్రెయినేజీలను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం కట్టంగూర్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గాంధీనగర్ ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. గాంధీనగర్ నుంచి కట్టంగూర్ పెద్ద చెరువు వరకు డ్రెయినేజీ పనులు పునరద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ సమీపంలో గల పెద్దవాగు వద్ద ధ్వంసమైన కల్వర్టును ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, గడుసు శంకర్‌రెడ్డి, ఐతగోని నర్సింహ్మ, మర్రి రాజు, బొల్లెద్ద యాదయ్య, ధార భిక్షం, బాలనర్సింహ్మ, మేడి రాములు, గోపాల్, సిరిశాల శంకర్ తదితరులున్నారు. -
రాష్ట్ర స్థాయి వాలీబాల్‌కు బొల్లేపల్లి విద్యార్థులు
కట్టంగూర్ : రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్–14 విభాగంలో మండలంలోని బొల్లేపల్లి ౖహె స్కూల్ విద్యార్థులు ఏ.నిఖిత, జి.విజయ, అండర్–17 విభాగంలో కె.శ్రావణి, వి.ఐశ్వర్య ఎంపికైనట్లు ఇన్చార్జి ఎంఈఓ పర్నె చంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 విభాగంలో ఎంపికైన విద్యార్థులు ఈనెల 25న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాల పీఈటీ సి.హెచ్ బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు నరేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, యాదయ్య, అన్నపూర్ణ, బాబురావులు, ధర్మాంగ్ అభినందించారు.