- తాండూరు బస్టాండ్‌లో ఘటన
- మృతులిద్దరూ గుర్తుతెలియని వ్యక్తులే..
తాండూరు: వడదెబ్బతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం తాండూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తాండూరు బస్టాండ్‌లో బస్సులు పార్కింగ్ చేసే స్థలంలో గుర్తుతెలియని ఓ యువకుడు(30) ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చేతిలో వాటర్ ప్యాకెట్ పట్టుకొని తిరుగుతున్నాడు. కళ్లు తిరుగుతున్నాయని ఓ బస్సు నీడకు చేరుకున్నాడు. బస్సు డ్రైవర్ అతడి వివరాలు అడుగగా కళ్లు తిరుగుతున్నాయని యువకుడు చెప్పాడు. కొద్దిసేపటికే యువకుడు కిందపడి కాళ్లుచేతులు కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. యువకుడి వద్ద కాచిగూడ నుంచి అప్జల్‌గంజ్ వరకు, మహాత్మగాంధీ బస్‌స్టేషన్ నుంచి తాండూరుకు ప్రయాణించిన బస్ టిక్కెట్లులభించాయి. నగరంలోని కాచిగూడ స్టేషన్ రోడ్లోని త్రివేణి హోటల్ రసీదు లభ్యమైంది. ఈ రసీదుపై రమేష్ అని పేరు ఉంది. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన మెజ్‌బాన్ క్యాటరింగ్ విజిటింగ్ కార్డు లభించింది.
మరో ఘటనలో..
ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌లో పాస్‌ల జారీ చేసే కౌంటర్ సమీపంలోని ప్లాట్‌ఫాంపై ఓ గుర్తుతెలియని వ్యక్తి(50) మృతిచెంది ఉన్నాడు. ఇతడి వద్ద ఈనెల 1వ తేదీకి చెందిన కర్ణాటక రాష్ట్రం మిర్యాణం బస్ టిక్కెట్ లభించింది. మృతులకు సంబంధించిన వివరాలు లభించలేదని పోలీసులు తెలిపారు. వడదెబ్బతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసులను దర్యాప్తు చేస్తున్నారు.
మండిపోతున్న ఎండలు..
పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి భగభగతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. శుక్రవారం 40.2 డిగ్రీలు, శనివారం 40.8, ఆదివారం 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ తెలిపారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
Published Mon, May 4 2015 12:35 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement