హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. జనవరి నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు 2123 నమూనాలు పరీక్షించగా, వీటిలో ఇప్పటి వరకు 718 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 39 మంది చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతి చెందారు. స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చేరిన అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన నర్సింహదాస్(51) చనిపోగా, బొగ్గులకుంట కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.
అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరుకు చెందిన ప్రణయ్‌పాల్(13)ను స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం నిలోఫర్‌కు గురువారం తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన వీరి కుటుంబం ఇక్కడికి వచ్చి స్థిరపడింది. ఇక గాంధీ ఆస్పత్రిలో 26 మంది పాజిటీవ్, 34 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఫీవర్ ఆస్పత్రిలో 40 మంది చికిత్స పొందుతుండగా, వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరో 35 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.