
ప్రాణం మీదకు తెచ్చిన గచ్చకాయలాట
తొండిచేసి గెలిచావంటూ బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన మరో బాలిక
హుజూర్‌నగర్: ఇద్దరు బాలికలు సమీప బంధువులు. గచ్చకాయల ఆట(అచ్చెన గిల్లలాట)లో నేనే గెలిచానంటే.. లేదు నేనే గెలిచా. ఇద్దరి మధ్య పట్టువిడుపు.. తగాదా.. ఆగ్రహావేశాలకు ఓ బాలిక కిరోసిన్ తెచ్చి మరో బాలికపై పోసి నిప్పంటించింది. దీంతో తీవ్రంగా కాలిన గాయాలతో ఓ బాలిక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మునగాల మండలం బరాఖత్‌గూడేనికి చెందిన 11 ఏళ్ల బాలిక వేసవి విడిదిగా అమ్మమ్మ గ్రామమైన బూరుగడ్డకు వచ్చింది. సమీప బంధువువైన ఎనిమిదేళ్ల బాలికతో స్నేహంగా ఉంటోంది. ఇంటిల్లిపాది వ్యవసాయ పనికి వెళ్తుండడంతో ఇద్దరు కలసి ఆడుకునేవారు. ఈ క్రమంలో మంగళవారం ఇరు కుటుంబాల వారు వ్యవసాయ పనులకు వెళ్లారు. అమ్మమ్మ దగ్గరికి వచ్చిన బాలిక ఇంటి దగ్గర ఇద్దరు కలసి గచ్చకాయల ఆట ఆడారు. ఓ దశలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక గెలిచింది. లేదు.. లేదు నేనే గెలిచా.. నువ్వు తొండి చేశావంటూ అదే గ్రామానికి చెందిన బాలిక తగాదా పెట్టుకుంది.
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఓడిపోయిన బాలిక పక్కనే ఇంట్లో ఓ బాటిల్‌లో ఉన్న కిరోసిన్‌ను తెచ్చి మరో బాలికపై పోసింది. అగ్గిపెట్టె గీసి అంటించింది. వెంటనే ఇంటికి పరుగుతీసింది. మంటలకు తాళలేక ఆ బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలు ఆర్పారు. వెంటనే చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామంలో ఈ సంఘటన కలకలం సృష్టించింది.