రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
Published Thu, Mar 31 2016 3:19 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
భూదాన్‌పోచంపల్లి వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి, కట్టంగూరు మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన చెర్కు కాశీనాథ్, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు గౌతంగౌడ్(24) లండన్‌లో ఎంఎస్ చేసి నాలుగు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. ఉద్యోగ అన్వేషణలో భాగం గా కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉంటున్నాడు.
కాగా బుధవారం మండల శివారులోని కొత్తగూడెంలో జరిగిన మేనమామ కొడుకు వివాహానికి వచ్చాడు. వివాహం అనంతరం అక్కడ నుంచి స్నేహితుడి కారులో స్వస్థలమైన జలాల్‌పురం వస్తున్నాడు. నేతాజీ కళాశాల దాటిన తరువాత మూలమలుపు వద్ద అతివేగంగా వస్తూ కారు అదుపుతప్పి బోల్తా కొట్టి రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌతం తల పగిలి అక్కడకక్కడే మృతి చెందా డు. కారు నుజ్జునుజ్జు అయ్యింది.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పంచనామా అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సంఘటనా స్థలంలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
కట్టంగూర్ : సూర్యాపేట మండలం కొత్తిరెడ్డిగూడేనికి చెందిన తండ్రీకొడుకులైన దుబ్బాక వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డిలు మంగళవారం రాత్రి సూర్యాపేట నుంచి హైదరాబాదుకు డీసీఎం వాహనంలో కోళ్ల ధానా తీసుకెళుతున్నారు. మార్గమధ్యలో అయిటిపాముల గ్రామశివారులోకి రాగానే డీసీఎం వెనక టైరు పంక్చర్ అయ్యింది. దీంతో డ్రైవర్ బెల్లి యాదయ్య టైరు మారుస్తుండగా తండ్రీకొడకులు సహాయం చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో హైదరాబాదు వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తండ్రీకొడుకులకు గాయాలయ్యాయి. హైదరాబాదు కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సత్యనారాయణరెడ్డి (18) బుధవారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
Advertisement
Advertisement