ఇద్దరిని కాపాడి మృత్యు ఒడిలోకి..
జన్నారం: అతను చేసిన పనికి కూలి డబ్బులు తీసుకునేందుకు వచ్చాడు. అంతలోనే ఇంటి యజమాని కరెంట్ షాక్‌కు గురయ్యాడు.. అతనిని కాపాడే ప్రయత్నంలో బాదావత్ లక్ష్మి అనే ఇంటి యజమాని బంధువుకు షాక్ తగిలింది. చూస్తూ ఉండలేని అతను వారిద్దని కాపాడి.. తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం మొర్రిగూడెంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన బాదావత్ సురేష్ ఇంటికి జాడి శ్రీనివాస్ కూలీ డబ్బుల కోసం బుధవారం వెళ్లాడు. ఆ సమయంలో సురేష్ ఇంటిముందు ఉన్న తీగపై దుస్తులు ఆరవేస్తున్నాడు.
ఈ క్రమంలో తీగకు విద్యుత్ ప్రసారం జరిగి, షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న బాదావత్ లక్ష్మి.. సురేష్‌ను కాపాడేందుకు పరుగున వెళ్లి షాక్‌కు గురైంది. ఇద్దరు షాక్‌తో కొట్టుకుంటుండగా, జాడి శ్రీనివాస్ వెళ్లి వారిద్దరిని లాగేశాడు. ఈ క్రమంలో వారిద్దరు పడిపోగా శ్రీనివాస్ షాక్‌కు గురయ్యాడు. చుట్టుపక్కల వారు ముగ్గురిని జన్నారంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగతా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.