చిట్యాల, న్యూస్‌లైన్ : జిల్లాలో వేర్వేరుచోట్ల విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో రైతు, కూలీ ఉన్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం... మండలంలోని సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన సుంకరి బాబురావు(40)కు ఎనిమిదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన మొక్కజొన్నకు నీళ్లు పారించేందుకు శనివారం వ్యవసాయబావి వద్దకు వెళ్లాడు.
కరెంట్ మోటార్‌ను వ్యవసాయబావి లోపలికి దింపేందుకు మోటార్‌కున్న క్రేన్ వైరును విప్పుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యూడు. దీంతో ఎగిరి బండరాయికి తగలడంతో తలకు తీవ్రగాయమై బావిలో పడ్డాడు. పక్కనే పత్తి తీస్తున్న కూలీలు బావిలోపడ్డ శబ్దం రావడంతో వెంటనే అక్కడికి చేరుకుని చూసి కేకలు వేశారు. పరిసర పంట చేలల్లో ఉన్న రైతులు వచ్చి బావిలోకి దిగి బాబురావును బయటకు తీశారు. కొనఊపిరితో ఉన్న బాబురావును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.
మృతుడికి భార్య సుగుణ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న బాబురావు మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్యాపిల్లలు, బంధువుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించారుు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. రైతు మృతితో సుబ్బక్కపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అశోకనగరంలో కూలీ..
అశోకనగరం(ఖానాపురం) : విద్యుదాఘాతానికి గురై ఓ కూలీ మృతిచెందిన సంఘటన మండలంలోని అశోకనగరంలో శనివారం జరిగింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మల్యాల సోమలింగం(58) గ్రామ శివారులోని ఏపీటీడబ్ల్యూఎస్ పాఠశాల ఆవరణలో జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు స్లాబ్‌కు, గోడలకు నీళ్లు కొట్టేవాడు. ఈ క్రమంలో మోటర్ స్విచ్ వేసినా నీళ్లు రాకపోవడంతో మోటర్ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. సమీపంలో ఉన్న వారు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య భద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి అశోక్‌కుమార్ తెలిపారు.
వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
Published Sun, Apr 13 2014 4:14 AM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM
Advertisement