ప్రభాకర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు, కార్మికులు, ఇన్‌సెట్లో చికిత్స పొందుతున్న అశోక్, డ్రైవర్ రమేశ్
యాదగిరిగుట్ట/నిడమనూరు : ఆర్టీసీ సమ్మె కొలిక్కి రాకపోవడంతో మనోవేదనకు గురైన ఇద్దరు కార్మికులకు గుండెపోటు వచ్చింది. వీరిద్దరిని చూసి చలించిపోయిన ఓ మహిళా కండక్టర్ తీవ్ర అస్వస్థతకు గురైంది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోవద్ద ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు.. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడపకుండా అడ్డుకోవాలనే ఉద్దే శంతో గ్యారేజీలో విధులు నిర్వహించే పోతంశెట్టి ప్రభాకర్ బుధవారం రాత్రి డిపో పార్కింగ్‌లో పడుకున్నాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో కార్మికులందరితో కలసి ప్రభాకర్ ధర్నా చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కార్మికులు అతడిని 108లో భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అనంతరం కొత్తపేటలోని సాయిసంజీవిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని జేఏసీ నేతలు తెలిపారు. ఈ ఘటనతో చలించిపోయిన యాదగిరిగుట్ట డిపో కండక్టర్ పుష్పలత అస్వస్థతకు గురవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని కార్మికులు తెలిపారు. సమ్మెపై రోజుకోరకమైన ప్రకటనలు వస్తుండటం చూసి మనోవేదనకు గురై యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ డ్రైవర్ రమేశ్ గుండెపోటుకు గురయ్యాడు. గురువారం ఇంట్లో కుటుంబ సభ్యులతో సమ్మె గురించి మాట్లాడుతూ కుప్పకూలాడు. దీంతో అతడిని మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు.
మరో కార్మికుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం సోమారంలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తొర్రూర్ డిపో కేంద్రంలో మేకల అశోక్ రెండేళ్ల నుంచి శ్రామిక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సమ్మె నేపథ్యంలో జీతాలు రాక కుటుంబ పోషణ కష్టంగా మారడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతోహైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment