దేశంలోనే మొదటిసారిగా వరంగల్‌లో తీర్పు
వరంగల్, న్యూస్‌లైన్: ఢిల్లీలో యువతిపై జరిగిన లైంగిక దాడి అనంతరం పురుడు పోసుకున్న నిర్భయచట్టం అమలైన నాటి నుంచి దేశంలోనే మొదటిసారిగా వరంగల్‌లో ఇద్దరికి శిక్ష పడింది. ఓ బాలికపై లైంగిక దాడి చేసిన ఇద్దరికి వరంగల్‌లోని బాలికలపై లైంగిక దాడుల పరిరక్షణ కేసులను విచారించే ప్రత్యేక కోర్టు మొదటి అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారానికి చెందిన బాలిక(15) తల్లి, అన్నావదినలు గతేడాది మార్చి14న కరీంనగర్ జిల్లా వేములవాడకు వెళ్లారు. మరుసటి రోజు తండ్రి రాత్రి తన చిన్న అత్త ఇంటి వద్ద కూతురిని వదిలి పొలానికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఆమె బంధువులు సంజీవ్, బండారి విజయ్‌లు బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయమై బాధితురాలు హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి సీఐ మనోహర్ నిందితులపై ఐపీసీ 366, 376డీ, 506 రెడ్ విట్, సెక్షన్(5) సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో వరంగల్ బాలికలపై లైంగిక దాడుల పరిరక్షణ కేసులను విచారించే ప్రత్యేక కోర్టు మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కేబీ.నర్సింహులు.. నిర్భయ చట్టం కింద నిందితులిద్దరు జీవితాంతం (తుదిశ్వాస విడిచే వరకు) కారాగారంలో శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు. కాగా, ఈ తీర్పుపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.