రాంగోపాల్‌పేట్: చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు తెల్లవారుజాము 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు, రంగం వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర నేపథ్యంలో రెండువేల మంది సిబ్బందితో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
అమ్మవారికి శాక, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, బలిగంప, గావు పట్టడం, అంబారీ ఊరేగింపు వంటి ప్రధాన ఘట్టాలు రెండు రోజులపాటు కొనసాగుతాయి. గతేడాది ఘటోత్సవం నుంచి రంగం వరకు 15 రోజుల పాటు 20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 25 లక్షలు దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే కనీసం 5 లక్షల మందికి పైగా దర్శనానికి వస్తారని భావిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment