♦ పెళ్లయిన 20 రోజులకే..
♦ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
♦ బాధితురాలు మైనర్
కామారెడ్డి : అందమైన జీవితంపై ఎన్నో ఆశలతో ఆమె మెట్టింట్లో అడుగు పెట్టింది. కళ్లల్లో పెట్టి చూసుకునే భర్త, తండ్రిలా చూసుకునే మామ ఉన్నారనుకొని మురిసిపోయింది. కానీ, ఆమె ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయి నెల రోజులు కూడా తిరగలేదు.. తండ్రిలా చూసుకోవాల్సిన మామ కట్టు తప్పాడు. కోడలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పైగా విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించాడు. కామారెడ్డి మండలంలోని దేవునిపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు మైనర్ అని తెలిసింది. ఎస్సై సంతోష్‌కుమార్ కథనం ప్రకారం..
దేవునిపల్లికి చెందిన మంగలి రాములు (50) కుమారుడి వివాహం ఏప్రిల్ 2న జరిగింది. సంతోషంగా మెట్టినింట్లో అడుగు పెట్టిన కోడలిపై రాములు కన్నేశాడు. ఏప్రిల్ 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఎవరికి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయింది. అయితే, మామ వేధింపులు రోజురోజుకి ఎక్కువయ్యాయి. విసిగిపోయిన బాధితురాలు జరిగిన విషయాన్ని ఫోన్‌లో తన తల్లికి తెలిపింది. ఆమె గురువారం దేవునిపల్లి ఠాణాలో పిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.